ఏపీలో బీజేపీకి పవన్ కళ్యాణ్ ఎటువైపు ఉంటారో తేల్చుకోమని పరీక్ష పెడితే, తెలంగాణలో బీజేపీ పవన్ కళ్యాణ్‌కి టిడిపి, బీజేపీలలో ఎటువైపు ఉంటారో తేల్చుకోమని పరీక్ష పెట్టడం విశేషం.
తెలంగాణ బీజేపీ మొదట ఎవరితో పొత్తులు అవసరమే లేదని ఒంటరిగా పోటీ చేసి విజయం సాధించగలదని ధీమా వ్యక్తం చేసింది. బండి సంజయ్ పార్టీ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు బీజేపీ అంత ఆత్మవిశ్వాసంతో ఉండేది. తమకు ఎవరి అవసరం లేదని నిష్కర్షగా చెప్పిన బీజేపీయే ఇప్పుడు పవన్ కళ్యాణ్ మద్దతు ఇవ్వాలని కోరుతోంది. బీజేపీ ప్రస్తుత దుస్థితిని ఇది అద్దం పడుతున్నట్లు భావించవచ్చు.
అయితే తెలంగాణలో జనసేన 32 స్థానాలకు పోటీ చేసేందుకు సిద్దమైంది కనుక ఇప్పుడు ఆ ఆలోచన విరమించుకోలేమని పవన్ కళ్యాణ్ చెప్పారు. అంటే మద్దతు ఇవ్వలేమనే అర్దం.
ఒకవేళ జనసేనతో బీజేపీ పొత్తులకు సిద్దపడి ముందుకు వచ్చి ఉంటే పవన్ కళ్యాణ్ అంగీకరించేవారేమో? కానీ జనసేన అసలు పోటీ చేయకుండా బీజేపీకి మద్దతు ఇవ్వాలని కోరడం రాజకీయ దురాశే కదా?
రాష్ట్ర విభజన సమయంలో జరిగిన ఎన్నికలలో బీజేపీ-టిడిపిల కోసం జనసేన పోటీ చేయకుండా త్యాగం చేసింది. హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో బీజేపీ కోసం మళ్ళీ త్యాగం చేసింది. మళ్ళీ ఇప్పుడూ త్యాగం చేయాలని బీజేపీ కోరుతోంది.
ఒకవేళ పవన్ కళ్యాణ్ మాటకు బీజేపీ పెద్దలు విలువిచ్చి ఉంటే తెలంగాణలో బీజేపీతో పొత్తులకు సిద్దపడి ఉండేవారేమో? కానీ పవన్ కళ్యాణ్‌ని ఏపీ సిఎం జగన్, మంత్రులు ఎంతగా నీచాతినీచంగా అవమానిస్తున్నా, అవహేళన చేస్తున్నా, ఎన్ని ఇబ్బందులు పెడుతున్నా ఏనాడూ ఏపీ బీజేపీ కానీ కేంద్ర ప్రభుత్వం గానీ పట్టించుకోలేదు. కనీసం స్పందించలేదు.
ఆయన వ్యక్తిగత సమస్యలను పట్టించుకోకపోయినా రాష్ట్రంలో సమస్యల గురించి పవన్ కళ్యాణ్ చెప్పినప్పుడైనా కేంద్ర ప్రభుత్వం పట్టించుకొని ఉండాలి. కానీ వాటినీ పట్టించుకోలేదు. మరి అటువంటప్పుడు తెలంగాణ బీజేపీ కోసం జనసేన త్యాగాలు చేయవలసిన అవసరం ఏముంది?
అయినా ప్రతీ ఎన్నికలలో ఏదో ఓ పార్టీ కోసం త్యాగాలు చేసుకొంటూ పోతే ఇక జనసేన పార్టీ నడిపించడం దేనికి?ఈ లెక్కన జనసేన ఎప్పుడు రాజకీయంగా ఎదగలదు?ఎప్పుడు అధికారంలోకి రాగలదు? అని జనసేన కార్యకర్తల ప్రశ్నకు బీజేపీ సమాధానం చెప్పగలదా?
అందుకే ఇప్పుడు వెనక్కు తగ్గితే పార్టీ శ్రేణులు నిరుత్సాహపడతాయని పవన్ కళ్యాణ్ చాలా సున్నితంగా చెప్పారనుకోవచ్చు.






