చంద్రబాబు అరెస్టు తరువాత జనసేన – టీడీపీ పొత్తు ప్రకటన చేసిన పవన్ నేడు ఉమ్మడి కార్యచరణకు అంకురార్పణ చేయనున్నారు.చంద్రబాబు ని అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపిన వైసీపీ ప్రభుత్వం రాజమండ్రి ఘటనతోనే టీడీపీ పార్టీని, ఆపార్టీల నేతలను చావుదెబ్బ కొట్టామని భావించింది.
అయితే ఎప్పుటినుంచో సందిగ్దములో ఉన్న టీడీపీ – జనసేన పొత్తు అదే రాజమండ్రి వేదికగా బహిర్గతమవ్వడం, “వైసీపీ విముక్త ఆంద్రప్రదేశ్” స్థాపించడమే ఈ రెండు పార్టీల ఉమ్మడి లక్ష్యం అంటూ అటు లోకేష్, ఇటు పవన్ పేర్కొనడం, తాజాగా ఇరు పార్టీల ఉమ్మడి కార్యచరణకు ఇదే రాజమండ్రి వేదిక కానుండడం వైసీపీ అంతానికి అందిన దేవుడి స్క్రిప్ట్ లో భాగమే అంటున్నారు ఇరు పార్టీల ముఖ్య నేతలు.
2024 ఎన్నికల రాజకీయాలు రాజమండ్రి కేంద్రంగా మారనున్నాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ రోజు మధ్యాహ్నం రాజమండ్రిలో పవన్, లోకేష్ ల భేటీ ఏపీ రాజకీయాలలో ఒక నూతన అధ్యాయానికి నాంది పలుకుతుంది అంటూ పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం పడుతున్నారు.ఈ సమావేశంలో ఇరు పార్టీలు సీట్ల సర్దుబాట్లు, పోటీ చేసే ఆయా పార్టీల నియోజక వర్గాలు, పార్టీలలో నూతన చేరికల నేతల సీట్ల సర్దుబాట్లు ఇతరత్రా సమస్యల గురించి చర్చించే అవకాశం ఉంది.
పొత్తులో భాగంగా ఇరు పార్టీల కార్యకర్తలను, నాయకులను సమన్వయ పరచడం, ఒకరి పార్టీ నేతల గెలుపుకి మరో పార్టీ నేతలు సహకరించడం, ఓటుబదిలీ ప్రక్రియను ఇరు పార్టీల నేతలు సక్రమంగా అమలు జరిగేలా చర్యలు తీసుకోవడం వంటి కార్యక్రమాల అమలుకు ఆయా ప్రాంతంలోని ముఖ్య నేతలకు బాధ్యతలను అప్పగించడం, బాబు అక్రమ అరెస్టుని ప్రజాక్షేత్రంలో పోరాటాలతో ఎలా ముందుకు తీసుకువెళ్లాలి అనే ఉమ్మడి కార్యచరణ రూపొందించుకోవడం ఇరు పార్టీలకు అవసరం.
పవన్ కళ్యాణ్ కు ఉన్న చరిష్మా, ప్రజాదరణ,పవన్, జగన్ పై చేసే పదునైన విమర్శలు జనసేన పార్టీకి కలిసివచ్చే అంశాలు. అలాగే ఎన్ని ఒడిదుడుకులను ఎదుర్కొన్నప్పటికీ 40 సంవత్సరాల అనుభవం ఉన్న రాజకీయ పార్టీగా టీడీపీకి బూత్ స్థాయి నాయకత్వం, సీనియర్ లీడర్లు, తండ్రి అరెస్టుతో ఇప్పటికే రాజకీయాలలో రాటు తేలిన లోకేష్, బాబు అరెస్టుతో ప్రజా క్షేత్రంలోకి మొట్టమొదటి సారిగా అడుగుపెట్టనున్న నందమూరి ఆడపడుచు, నారా వారి కోడలు భువనేశ్వరి, దానికి తోడు టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తో ప్రజలలో టీడీపీ పార్టీకి కొత్తగా వచ్చిన మైలేజ్ ఇవన్నీ టీడీపీ బలోపేతానికి మార్గాలుగా భావించాలి.
అయితే ఇరు పార్టీల అధినేతల సమావేశంతో రాజమండ్రి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు ఉపందుకోబోతున్నాయి. అలాగే పవన్, లోకేష్ భేటీలతో టీడీపీ – జనసేన నాయకులలో జోష్ పెరిగింది. అంతే స్పీడ్ గా వైసీపీ నాయకులలో తమ రాజకీయ భవిష్యత్ పై అలజడి మొదలయ్యింది. ఏపీ లో అన్ని రాజకీయ పార్టీల, అందరి రాజకీయ నాయకుల చూపు రాజమండ్రి వైపే అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.




