ఎవరి కంటినీరు తుడవడానికి ఎన్నికలలో పోటీకి సిద్దమయ్యారో!

Pawan-Kalyan-Ignores-BJP

పవన్ కళ్యాణ్ ఇంతవరకు ఒక్క అవినీతి మచ్చలేని రాజకీయ నాయకుడిగా గుర్తింపు అయితే దక్కింది కానీ తన రాజకీయ పార్టీ జనసేన మీద మాత్రం ఆరోపణలు, విమర్శలు ఎదుర్కొంటూనే ఉన్నారు. పార్టీ స్థాపించి దశబ్ద కాలం గడిచిపోయింది. తెలంగాణాలో పార్టీ ఆవిర్భవించి ఆంధ్రాలో రాజకీయం మొదలుపెట్టిన జనసేన రెండు రాష్ట్రాల పైన సరైన శ్రద్ద పెట్టలేదనే చెప్పాలి.

తెలంగాణతో పోలిస్తే ఆంధ్రాలో పార్టీ కొంతవరకు నిలదొక్కుకున్న మాట వాస్తవమే.అయితే గత తెలంగాణ ఎన్నికలకు దూరంగా ఉన్న జనసేన ఈ సారి మాత్రం పోటీకి సై అంటూ ముందుకొచ్చింది. మొదటగా 32 సీట్లలో పోటీకి సిద్దమైన పార్టీ బీజేపీ పెద్దల చర్చలతో 8 స్థానాలకు పరిమితమైపోయింది. టి.జనసేన నేతలు పట్టుబట్టడంతో కనీసం ఆ ఎనిమిది సీట్లనైనా దక్కించుకోగలిగారు పవన్.

ADVERTISEMENT

ఎన్నికల ఆఖరి నిమిషంలో పార్టీ నేతలకు బి.ఫామ్ అందించిన పవన్ ఇన్ని సంవత్సరాలుగా తన పార్టీ కోసం కష్టపడిన, పార్టీ జెండా మోసిన నాయకుల కోసం కనీసం ప్రచారానికి సైతం వెళ్ళకపోవడం విమర్శలకు తావిస్తుంది. ఎదో మీరు పట్టుబట్టారు నేను పార్టీ తరుపున బి. ఫామ్ ఇచ్చాను అన్నటుగా పవన్ వైఖరి కనపడుతుంది.

బీజేపీ నిర్వహించిన మోడీ సభలో ప్రత్యేక్షమైన పవన్ తన పార్టీ తరుపున పోటీ చేస్తున్న యువ నాయకులను దగ్గరుండి ప్రోత్సహించాల్సిన సమయంలో ప్రచారానికి వెనకడుగు వేయడం దేనికి సంకేతంగా భావించాలి. గతంతో పోలిస్తే ఆంధ్రాలో జనసేన బలం పెరిగిన మాట వాస్తవమే అయినా పవన్ లేకుండా పార్టీ సభ నిర్వహిస్తే ఆ సభకు వచ్చే ప్రజాదరణ ఏమాత్రం ఉంటుందో అందరు ఊదించదగ్గదే.

అలాంటిది అసలు తెలంగాణాలో పార్టీ ఉనికి ఉందో లేదో, పార్టీ గుర్తు ఏంటో, పార్టీ తరుపున పోటీ చేసే నాయకులు ఎవరో అనే అనుమానాలు ప్రజాక్షేత్రంలో కోకొల్లలుగా ఉన్నాయి. పోటీ చేసేది ఎనిమిది స్థానాలే కాబట్టి పవన్ కనీసం ఆ ఎనిమిది నియోజకవర్గాలలో అయినా తన పార్టీ తరుపున పోటీకి సిద్దమైన నాయకుల కోసం ప్రచారం చేయలేకపోతే ఇక ఏ నమ్మకంతో ప్రజలు ఆ ఆపార్టీకి ఓటు వేస్తారు, ఏ భరోసాతో నాయకులుగా ఎన్నుకుంటారో ఒక్క సారి పవన్ ఆలోచించాలి.

రాజకీయాలలో తలపండిన పార్టీలే అధినేతలు ప్రచారంలో పాల్గొనకపోతే నేతల గెలుపు కష్టమనే ఉద్దేశంతో పోటీని విరమించుకున్న తరుణంలో పోటీకి సై అన్న జనసేన గెలుపుకి పవన్ ఎంత శ్రమించాలో తెలుసుకోకుండా తన పార్టీని, పార్టీని నమ్ముకున్న నాయకులను ఎదరికీ చేరుస్తున్నారో..,ఏ వ్యూహంతో ముందడుగు వేసారో తెలుసుకోవాలి. ఇప్పటికే సినిమాలు…రాజకీయాలు అంటూ రెండు పడవల మీద కాళ్ళు మోపిన పవన్ ఇప్పుడు తెలంగాణ …ఆంధ్రా రెండు రాష్ట్రాల ఎన్నికలలో పోటీకి సిద్దపడి రెండు రాష్ట్రాల రాజకీయ పార్టీలకు ప్రత్యర్థిగా మారిపోతున్నారు.

తెలంగాణ ఎన్నికలలో పోటీ చేసిన స్థానాలలో తమ పార్టీ అభ్యర్థులు గౌరవప్రదమైన ఓట్లు కూడా సాధించలేకపోతే తమ మాటల దాడితో ప్రత్యర్థులను మానసికంగా దెబ్బకొట్టే వైసీపీ పార్టీ నేతలకు ఇప్పుడు పవనే తన చేచేతులా ఆహారాన్ని అందించినట్లయ్యింది.ఇప్పటికే పోటీ చేసిన రెండు స్థానాలలో ఓడిపోయారు అనే ఆరోపణతో అటు పవన్ ను ఇటు పవన్ ను అభిమానించే ఆయన అభిమానులను, జనసైనికులను కించపరుస్తున్నారు వైసీపీ నేతలు.

ఇటువంటి తరుణంలో పవన్ చాలా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. పోటీ చేయాలనీ నిర్ణయించుకున్న పవన్ పోటీలో నిలబడిన నేతల విజయానికి తనవంతు కృషి తానూ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా బి.ఫామ్స్ మాత్రమే నేను ఇస్తాను మిగిలిన తంతు మీరే ముగించాలి అంటే మాత్రం “ఎవరి కంటినీరు తుడవడానికి ఎన్నికలలో పోటీకి సిద్దమయ్యారో”! అనే విమర్శలను పవన్ ఎదుర్కోకతప్పదు.

ADVERTISEMENT
Latest Stories