ఏలూరు పర్యటనలో భాగంగా ” కోనసీమకు తెలంగాణ దిష్టి తగిలింది” అంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రోజుకో కొత్త రూపం దాల్చుతూ వివాదాన్ని మరింతగా బలపరుస్తుంది.
మొన్న బిఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి పవన్ కి బుర్రలేదు అంటూ విరుచుకుపడగా, నిన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి పవన్ తన వ్యాఖ్యలకై క్షమాపణలు చెప్పాలి అంటూ డిమాండ్ చేశారు.
ఇక నేడు కాంగ్రెస్ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి మాట్లాడుతూ పవన్ వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలను అవమానపరిచేలా ఉన్నాయని, ఆయన తన వ్యాఖ్యల పట్ల వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు.
అలాగే పవన్ అలా చేయని పక్షాన పవన్ సినిమాలను తెలంగాణలో ఆడనివ్వమని, ఒక తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రిగా ఇది నా ప్రకటన అంటూ పవన్ కి డెడ్ లైన్ విధించారు మంత్రి కోమటిరెడ్డి.
పవన్ తెలంగాణ ప్రజలకు బేషరతు క్షమాపణలు చెపితేనే ఆయన సినిమాలు ఇక్కడ కనీసం ఒకటి రెండు రోజులైనా ఆడుతాయి అంటూ పవన్ సినిమాల టార్గెట్ గా మంత్రి వ్యాఖ్యానించారు.
అయితే ఈ వివాదం ముదిరి ముదిరి అటు తిరిగి ఇటు తిరిగి చివరికి పవన్ సినిమాల వద్దకు వచ్చి ఆగింది. ఇక ఈ వివాదం మరింత రాజకీయ రంగు తొడిగితే పవన్ సినిమాల వరకు ఉన్న ఈ బెదిరింపులు మొత్తం సినీ పరిశ్రమకు వర్తింపచేస్తారా.?
మరి తెలంగాణ మంత్రి చేసిన ఈ ప్రకటన పవన్ సినీ కెరియర్ ను ప్రభావితం చెయ్యగలుగుతుందా.? అప్పుడు వైసీపీ ఇప్పుడు కాంగ్రెస్ పవన్ సినీ కెరియర్ ను దెబ్బ కొట్టాలని భావిస్తుందా.? మరి మంత్రి హెచ్చరికలు పవన్ తో క్షమాపణలు చెప్పించగలవా.?
ఏపీ లో టీడీపీ కానీ జనసేన నుంచి కానీ తెలంగాణకు వ్యతిరేకంగా ఏ చిన్న పదం దొర్లినా ఇంతలా రాజకీయం చేస్తున్న తెలంగాణ నాయకులు ఆంధ్రప్రదేశ్ నాయకుల నుంచి ఏపీ ప్రజల వరకు ఎంతలా కించపరిచేలా మాట్లాడినా చివరికి వారి ఆహార వ్యవహారాల మీద అసభ్యకర రీతిలో తప్పుబడుతూ విమర్శలు చేసినా ఏనాడైనా తెలంగాణ నాయకులు ఏపీ ప్రజలకు క్షమాపణలు చెప్పారా.? అంటూ ఏపీ వాసాలు ఎదురుదాడికి సిద్ధమయ్యారు.






