జనసేనాని పవన్ కళ్యాణ్ ఈరోజు మళ్ళీ మరోసారి వైసీపీ ప్రభుత్వంపై తనదైన శైలిలో ట్విట్టర్‌లో విమర్శలు గుప్పించారు. సిఎం జగన్మోహన్ రెడ్డి, ఆయన మంత్రులు మూడు రాజధానులతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని వాదిస్తుండటంపై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ, వ్యంగ్యంగా ఓ కార్టూన్ పోస్ట్ చేశారు.
అమెరికా దక్షిణ డకోటాలో బ్లాక్ హిల్స్ పర్వతశ్రేణులపై అమెరికాను పరిపాలించిన నలుగురు అధ్యక్షుల రాతి శిల్పాలున్నాయి. మౌంట్ రష్‌మోర్ నేషనల్ మెమోరియల్ పేరుతో సుప్రసిద్దమైన శిల్పాలు ఉన్నాయి. అవి ప్రజాస్వామ్యానికి, స్వేచ్చా విశ్వాసాలకు ప్రతీకాలని అమెరికన్లు భావిస్తుంటారు.
పవన్ కళ్యాణ్ వాటిని అనుకరిస్తూ విశాఖలో ఋషికొండపై సిఎం జగన్, మంత్రుల శిల్పాలతో రూపొందించిన ఓ కార్టూన్ పవన్ కళ్యాణ్ ఈరోజు ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. దానికి “మౌంట్ దిల్ మాంగే మోర్” అనే నామకరణం కూడా చేశారు. ‘ధన-వర్గ-కులస్వామ్యానికి చిహ్నం” అంటూ, చివరిగా గమనిక ‘బూతులకి కూడా’ అని ముక్తాయించారు.
పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ, “పరిపాలన వికేంద్రీకరణతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి చెందుతుందనుకొంటే మూడు రాజధానులే ఎందుకు? 25 జిల్లాలను 25 రాష్ట్రాలుగా ప్రకటించేసి 25 రాజధానులను ఏర్పాటు చేసుకొని ఏపీని “యునైటడ్ స్టేట్స్ ఆఫ్ ఆంద్రప్రదేశ్” గా ప్రకటించేయండి. మీరు (సిఎం జగన్మోహన్ రెడ్డి) చట్టానికి, న్యాయవ్యవస్థకు, రాజ్యాంగానికి అతీతం అన్నట్లు వ్యవహరిస్తూ, ప్రజాభిప్రాయంతో సంబందం లేనట్లు నిర్ణయాలు తీసుకొంటారు. కనుక ఆంధ్రప్రదేశ్‌ని మీ సొంత రాజ్యంగా ప్రకటించుకొని సొంత రాజ్యాంగమే అమలుచేయొచ్చు కదా? ఇంకా దేనికి సంకోచిస్తున్నారు” అని అన్నారు.
నిజానికి ఇప్పుడు ఏపీలో వైసీపీ సొంత రాజ్యాంగమే అమలవుతోంది. అందుకే టిడిపి, జనసేన నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. వారిపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. నిజానికి వైసీపీ నేతల మనసులో ఉన్న మాటనే పవన్ కళ్యాణ్ బయటకి చెప్పారనుకోవచ్చు. మరో 20-30 ఏళ్ళు మేమే అధికారంలో ఉంటామని చెప్పడానికి అర్దం అదే! ఇంకా దేశంలో రాజ్యాంగం, న్యాయవ్యవస్థ, కేంద్ర ప్రభుత్వం బలంగా ఉన్నాయి కానీ లేకుంటే వైసీపీతో సహా చాలా పార్టీలు ఎన్నికలను రద్దుచేసి సొంతరాజ్యాంగమే అమలుచేస్తూండేవి. తెలంగాణ సిఎం కేసీఆర్ కొత్త రాజ్యాంగం వ్రాయాలని ఎప్పుడో చెప్పారు. ఆయన ప్రధాని అయితే మొట్టమొదట అదే చేస్తారు.
“United States of Andhra“
విశాఖ జిల్లా లోని,రుషికొండ పర్వత శ్రేణుల్లో ఉన్న..ఈ “మౌంట్ దిల్ మాంగే మోర్"
“ధన-వర్గ-కులస్వామ్యానికి చిహ్నం”
P.S (బూతులకి కూడా…) pic.twitter.com/ckxlO21ZGl
— Pawan Kalyan (@PawanKalyan) October 11, 2022

—



