విశాఖలో విపక్ష నేతలు… విశాఖ రాజధానిని అడ్డుకోవడానికేనట!

Pawan Kalyanవైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల పాట మొదలుపెట్టి ఓ రెండేళ్ళు హైపిచ్‌లో పాడింది. ఆ తర్వాత తూచ్ మూడు కాదు విశాఖ ఒకటే రాజధాని… జనాలు, మీడియా తప్పుగా అర్దం చేసుకొన్నాయని బుగ్గన బాంబు పేల్చారు. తద్వారా తమ ప్రభుత్వం రాయలసీమ ప్రజలను మోసగిస్తోందని స్వయంగా బయటపెట్టేసుకొన్నారు. కర్నూలులో హైకోర్టుని ఏర్పాటు చేయమని సుప్రీంకోర్టుకి చెప్పడంతో అది నిజమని స్వయంగా మరోసారి ధృవీకరించారు.

సరే విశాఖనైనా రాజధానిగా చేశారా?అంటే నేటికీ చేయలేదు. కానీ దాని కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు నిసిగ్గుగా విశాఖలో ర్యాలీ, సభ నిర్వహించి తమ అసమర్ధతకు, వైఫల్యానికి చంద్రబాబు నాయుడుని తిట్టిపోశారు. నేటికీ ఇంకా నిందిస్తూనే ఉన్నారు.

ADVERTISEMENT

విశాఖ ప్రజలను మభ్య పెట్టారు సరే చివరికి పెట్టుబడిదారులను కూడా మభ్యపెట్టారు. “నేడో రేపో విశాఖకి వచ్చేస్తున్నా అక్కడి నుంచే రాష్ట్రాన్ని పాలిస్తానంటూ” సిఎం జగన్మోహన్ రెడ్డి నమ్మబలికారు. కానీ ఇంతవరకు రాలేదు. అందుకే పరిశ్రమలు కూడా రాలేదు.

అమరావతిని వద్దనుకొన్నారు సరే… కానీ విశాఖను రాజధాని చేయాలనే ప్రతిపాదనపై కూడా వైసీపీకి చిత్తశుద్ధిలేదని స్పష్టమైంది. మరి అటువంటప్పుడు ఎవరినో నిందించడం ఎందుకు?

విశాఖలో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఒకేసారి పర్యటిస్తే వారిద్దరూ కలిసి విశాఖ రాజధాని కాకుండా అడ్డుకోవడానికే వచ్చారంటూ మంత్రి సీదిరి అప్పలరాజు వితండవాదం చేశారు. మిగిలిన మంత్రులు కూడా కాస్త అటూ ఇటూగా అదే పాట పాడుతున్నారు.

అయితే అధికారంలో ఉన్నది వైసీపీ ప్రభుత్వం. అది తలుచుకోగానే ఋషికొండను పిండి చేసేసింది. కనుక విశాఖలో రాజధాని ఏర్పాటు చేయాలనుకొంటే దానిని అడ్డుకోగలవరెవరు?కానీ అధికారంలో ఉన్నప్పుడే చేయలేక చేతులెత్తేసి తమ అసమర్ధతకు, వైఫల్యానికి చంద్రబాబు నాయుడుని, పవన్‌ కళ్యాణ్‌ని నిందిస్తుంటే, ప్రజలకు అది అర్దం అవుతోంది. కాదనుకోవడం అవివేకమే కదా?

వైసీపీ ప్రాధాన్యతలు, ఆలోచనలు వేరేగా ఉన్నాయి. సంక్షేమ పధకాల పేరుతో ప్రజలకు డబ్బు పంచిపెడుతూ వారిని దానికి అలవాటుపడేలా చేయగలిగితే వారు పక్క చూపులు చూడకుండా మళ్ళీ మళ్ళీ తమకే ఓట్లు వేసి గెలిపిస్తారనే దురాలోచన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం పాలిట శాపంగా మారింది.

చివరికి ‘విశాఖ రాజధాని’ అంశాన్ని కూడా వైసీపీ రాజకీయ వ్యూహంగానే భావిస్తోందని మంత్రులు మాటలే పట్టి ఇస్తున్నాయి. పైగా ఓ మహిళా మంత్రి “పవన్‌ కళ్యాణ్‌ అప్పుడు నోట్లో హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకొన్నావా?” అంటూ ద్వందార్ధంతో మాట్లాడటం చూసి అందరూ సిగ్గుతో తలదించుకొంటున్నారు.

అవి సంక్షేమ పధకాలైనా, మూడు రాజధానులైనా, విశాఖ రాజధానే అయినా వైసీపీ చేసే ప్రతీపనిలో రాజకీయ కోణమే తప్ప నిబద్దత, చిత్తశుద్ధి ఉండవని పదేపదే నిరూపించుకొంటూనే ఉంది. కనుక చిత్తశుద్ధి లేని పనులకు ఫలితాలు కూడా అదేవిదంగా లభిస్తాయి. ఈవిషయం ఎన్నికల తర్వాత వారే స్వయంగా తెలుసుకొంటారు. అంతవరకు వారు పాడిందే పాట. ఆడిందే ఆట!

ADVERTISEMENT
Latest Stories