పవన్… ఈ సారి భారీ అంచనాలే ఉన్నాయ్..!

Pawan-Kalyan Janasenaరెండు తెలుగు రాష్ట్రాలలో ‘భీమ్లా నాయక్’ సందడి దాదాపుగా ముగిసినట్లే. మరో రెండు రోజుల్లో ప్రభాస్ “రాధే శ్యామ్” థియేటర్లలో ప్రత్యక్షం కానుండడంతో అందరూ ఇపుడు ఈ ‘ఇండియన్ మూవీ’ కోసం ఎదురు చూస్తున్నారు. ధియేటర్లలో పవన్ హంగామా ముగియగా, మరో నాలుగు రోజుల్లో మైదానంలో జరగబోయే బహిరంగ సభ కోసం జనసైనికులు ఎంతో ఆసక్తిగా నిరీక్షిస్తున్నారు.

మార్చి 14వ తేదీన ‘జనసేన’ ఆవిర్భావ సభను మంగళగిరిలో నిర్వహిస్తోన్న పవన్, ఈ సందర్భంగా ఎలాంటి ప్రసంగం చేయబోతున్నారనే ఆసక్తి అటు అభిమానులతో పాటు, ఇటు పొలిటికల్ వర్గాల్లోనూ వ్యక్తమవుతోంది. 2019 ఎన్నికలకు ఒక ఏడాది ముందు ఇలాగే ‘జనసేన’ ఆవిర్భావ సభలో టీడీపీని ఓ స్థాయిలో విమర్శించి, వైసీపీ అధికారంలోకి రావడానికి పరోక్షంగా కారణమయ్యారు పవన్.

ADVERTISEMENT

దీంతో ఈ సారి పవన్ అధికార పార్టీ విధివిధానాలపై ఎలాంటి ప్రసంగం చేయనున్నారు? అనేది అత్యంత ఆసక్తికరంగా మారింది. అందులోనూ ఇటీవల జరిగిన నరసాపురంలో బహిరంగ సభలో ‘మిగిలినవన్నీ జనసేన ఆవిర్భావ సభలో మాట్లాడతా’ అని పవన్ ప్రకటించి ఉన్నారు. అంతేగాక తదుపరి ఎన్నికల లక్ష్యంగానే ఈ ప్రసంగం ఉండబోతుందనేది పొలిటికల్ వర్గాలు కూడా పేర్కొంటున్నాయి.

నరసాపురం సభలో సినిమా టికెట్ల వివాదం గురించి ఒక్క మాట కూడా పవన్ ప్రస్తావించలేదు. ప్రస్తుతం తన సినిమా విడుదల అయిపోయింది, అలాగే టికెట్లకు సంబంధించిన కొత్త జీవో కూడా విడుదల అయ్యింది. దీంతో ఈ అంశం పైన పవన్ చాలా గట్టిగా ప్రసంగించే అవకాశాలు ఉన్నాయని పవన్ కళ్యాణ్ అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

ఏపీలో ‘భీమ్లా నాయక్’ నష్టం వస్తే వాటిని తాను పూరిస్తానని పవన్ హామీ చేసినట్లుగా, పంపిణీదారుల వీడియోలు కూడా ఇటీవల సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపధ్యంలో… ఖచ్చితంగా ఈ అంశాన్ని పవన్ ప్రస్తావిస్తారని ఫ్యాన్స్ గంపెడు ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా పవన్ అభిమానులు ఈ విషయమే చర్చించుకుంటున్నారు.

అలాగే తదుపరి ఎన్నికలలో ఉండబోయే పొత్తుల గురించి అప్పుడే మాట్లాడతారా? లేక వేచిచూసే ధోరణిని వహిస్తారా? అని వైసీపీ వర్గాలు కూడా ఎదురు చూస్తున్నాయి. టీడీపీ – జనసేనల కలయిక ఖచ్చితంగా వైసీపీకి ప్రతికూలంగా మారుతుందన్న విశ్లేషణలతో, పవన్ ప్రసంగంలో టీడీపీపై ఎలాంటి భావ వ్యక్తీకరణ ఉంటుందనేది రాజకీయంగా వైసీపీకి అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం.

పవన్ ప్రసంగాలు ఎప్పుడూ ఒకే విధంగా ఉండవు. పార్టీ స్థాపించినప్పుడు దూకుడైన స్వభావంతో చెలరేగిపోయిన పవన్, గత కొంతకాలంగా తన సహజశైలికి విరుద్ధంగా నింపాదిగా ప్రసంగిస్తున్నారు. కానీ అభిమానులు ఆశించేది మాత్రం… ఆవేశం, ఆలోచనలతో కూడిన పవన్ ప్రసంగం. ఒక సభలో మాట్లాడిన విధానానికి, తదుపరి సభలో మాట్లాడే విధానానికి పొంతన లేకుండా పవన్ ప్రసంగాలు ఉంటున్నాయి.

నరసాపురం సభలో ఫ్యాన్స్ కు కావాల్సిన స్టఫ్ పెద్దగా ఇవ్వకపోవడంతో నిరుత్సాహాపడగా, ఆవిర్భావ సభ ద్వారా తమ అభిమాన హీరో అదరగొడతారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. క్షేత్రస్థాయిలో బలంగా లేకపోయిన జనసేనకు పవన్ ప్రసంగాలే కొంత ఊపును, ఉత్సాహాన్ని పంచుతాయి. మరి ఆ విధంగా జనసైనికులకు ఉత్సాహాన్ని నింపడంలో జనసేన అధినేత చెలరేగిపోతారో లేదో తెలియాలంటే 14వ తేదీ వరకు వేచిచూడాల్సిందే.

ADVERTISEMENT
Latest Stories