
పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లు జూన్ 12న విడుదల కాబోతోంది రాసి పెట్టుకోండని వీరమల్లు టీమ్ చెపితే, అభిమానులు రాసి పెట్టుకొని మళ్ళీ ఎదురుచూడటం మొదలుపెట్టారు. కానీ మళ్ళీ వాయిదా పడింది!
అందుకు వీరమల్లు టీమ్ ఆ సినిమా అంత పెద్ద స్టోరీ చెప్పినా, సీజీ వర్క్స్ పూర్తికాకపోవడం వలన సినిమా రిలీజ్ చేయలేకపోతున్నామనేది దాని సారాంశం. దాదాపు నాలుగేళ్ళుగా తీస్తున్న హరిహర వీరమల్లు సినిమా నేటికీ పూర్తికాకపోవడం చాలా బాధాకరమే. పవన్ కళ్యాణ్ రాజకీయాలలో బిజీ అయిపోవడం వలననే ఇంత ఆలస్యమైంది. తన వలన నిర్మాత నష్టపోతున్నారని భావించిన పవన్ కళ్యాణ్ తాను తీసుకున్న అడ్వాన్స్ నిర్మాత ఏఎం రత్నంకు తిరిగి ఇచ్చేసి పెద్ద మనసు చాటుకున్నారు.
Also Read – యుద్ధాలతో కనపడే విధ్వంసం కొంత.. కనపడనిది అనంతం!
అయితే రెండు తెలుగు రాష్ట్రాలలో సింగిల్ స్క్రీన్ థియేటర్స్ యజమానులు టికెట్ రాబడిలో పర్సంటేజ్ విధానం అమలు చేయాలంటూ జూన్ 1 నుంచి థియేటర్స్ బంద్ చేయబోతే, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వారిపై “హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ కాబోతుంటే థియేటర్స్ బంద్ చేస్తారా? ఆయ్!” అంటూ నిప్పులు చెరిగారు.
వారిరువురూ ఆవిదంగా మాట్లాడటం వలన సింగిల్ స్క్రీన్ థియేటర్స్ యజమానులు ఎదుర్కొంటున్న సమస్య పరిష్కారం కాకపోగా పక్కదారి పట్టిందని నటుడు, చిన్న సినిమాల నిర్మాత ఆర్ నారాయణ మూర్తి ఆవేదన వ్యక్తం చేశారు కూడా.
Also Read – అది ప్రమాదమట.. కేసు నమోదు చేయడం కుట్రట!
వారిపై అంతగా విరుచుకు పడినప్పుడు హరిహర వీరమల్లుని జూన్ 12న విడుదల చేసుకున్నా బాగుండేది. కానీ సినిమా వాయిదా పడింది! కానీ వీరమల్లు కోసం వారిరువురూ మాట్లాడిన మాటలు మాత్రం మిగిలిపోయాయి. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్, కందుల దుర్గేష్ సినీ పరిశ్రమలో వారితో సమావేశాలు నిర్వహించి వారి సమస్యలు పరిష్కరించగలిగితే అందరికీ సంతోషం.