గత ఐదేళ్ల వైసీపీ హయాంలో ఎక్కువగా మీడియా దృష్టిలో ఉన్న నాయకుడు, టీడీపీ శ్రేణుల నోటిలో నానిన నేత కొడాలి నాని. ఈయన గారి భాష దగ్గర నుంచి హావభావాల వరకు ప్రతి ఒక్క అంశంలో కొడాలి నాని మీడియాను ఆకర్షించాడు, టీడీపీ కార్యకర్తల ఆగ్రహానికి కారణమయ్యాడు.
అయితే వైసీపీ ఓటమితో గుండె చేతిలో పట్టుకుని అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన కొడాలి నాని మీడియాకే కాదు కనీసం సొంత నియోజకవర్గం క్యాడర్ కు కూడా కనిపించడం లేదు, అలాగే రాష్ట్రంలో గత ఏడాదిగా కొడాలి భాష ఎక్కడ వినిపించడం లేదు.
కొడాలి లేని లోటు తానూ తీరుద్దాం అనుకున్నారో ఏమో కానీ పేర్ని నాని గత కొంతకాలంగా అతిగా ప్రవర్తిస్తూ మీడియా దృష్టిలో పడుతున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ టార్గెట్ గా ప్రెస్ మీట్లు పెట్టిన పేర్ని ఇప్పుడు ముఖ్యమంత్రి బాబు, ఐటీ మంత్రి లోకేష్ టార్గెట్ గా విమర్శలు ఎక్కుపెడుతున్నారు.
మొన్న పెడన ఘటన మొదలుకుని నిన్న గుడివాడ వివాదం వరకు పేర్ని నాని వ్యవహార శైలి పూర్తిగా ప్రభుత్వాన్ని రెచ్చకొట్టే ధోరణిలో, అధికారులను హెచ్చరించే వైఖరిలో, వైసీపీ కార్యకర్తలను బలిపీఠం ఎక్కించే విధానంలో సాగుతుంది.
పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి అరిచే కుక్కలు మాదిరి కాదు కరిచే కుక్కలు మాదిరి నడుచుకోవాలని అంటూ హింసా ప్రవచనాలు వెల్లవేసిన పేర్ని, ఇక గుడివాడలో వైసీపీ టీడీపీ పార్టీల మధ్య ఏర్పడిన వివాదం ను బీసీ మహిళ మీద జరిగిన దాడిగా చిత్రీకరించాలి అంటూ చేస్తున్న జ్ఞానబోధలు మొత్తం మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
తన ప్రవచనాలు, జ్ఞానబోధనలతో అడ్డంగా దొరికిపోయిన పేర్ని ఇక నేడు బరితెగింపుకి దిగారు. ఒక పక్క రాత్రికి రాత్రే పనికానిచ్చేయాలి అంటూ పార్టీ క్యాడర్ ను హింస వైపు ప్రేరేపిస్తూనే మరో పక్క మా పార్టీ మహిళ నేత మీద దాడి, దీనికి పూర్తి బాధ్యత లోకేష్ దే, రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అంటూ నానా హంగామా చేస్తున్నారు.
అలాగే చీకట్లో నరకమని నేను ఎవరికీ చెప్పలేదు, అలా చెప్పాలి అనుకుంటే పగలే వేసేయండి అని చెబుతా అంటూ ప్రభుత్వానికి ఎం చేస్తారో చేసుకోండి అన్నట్టుగా రెచ్చకొట్టే చర్యలకు దిగుతున్నారు.
నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ చివరికి అరెస్టు చేస్తే కాపుల మీద కూటమి ప్రభుత్వం కక్ష్య రాజకీయాలకు పాల్పడుతుంది అంటూ కులం కార్డు బయటకు తీయడం వైసీపీ రాజకీయంలో ఒక భాగమైపోయింది. ఇంతకీ పేర్ని నాని చూపిస్తున్న ఈ అత్యుత్సాహం మొత్తం అరవడానికా.? కరవడానికా.?






