చీకటిలో కన్నుకొడితే పేర్ని నాని జంప్….

Perni Nani on the Run After Hate Speech Case

వైసీపీ అధికారంలో ఉన్నప్పటి సంగతి సరే కానీ నేటికీ వారి వ్యవహారశైలి అలాగే ఉండటం విశేషం. జగన్‌ పల్నాడు పర్యటనలో వైసీపీ కార్యకర్తలు ‘రప్పా రప్పా తలలు నరుకుతామంటే’, జగన్‌ ప్రెస్‌మీట్‌ పెట్టి “తప్పేమిటి?అది కేవలం సినిమా డైలాగు మాత్రమే. ఒకవేళ ఆ డైలాగ్ పలకడం తప్పనుకుంటే సెన్సార్ బోర్డు ఆ సినిమాలలో వాటిని అనుమతించకూడదు కదా?” అని వితండవాదం చేశారు తప్ప ఆవిధంగా మాట్లాడటం తప్పని వారించలేదు. అంటే తలలు నరకడం తప్పు కాదని జగన్‌ భావిస్తున్నట్లనిపిస్తుంది.

మాజీ మంత్రి పేర్ని నాని కూడా క్యాచీగా ఉన్న ‘రప్ప రప్పా’ డైలాగ్ అందుకొని “చీకటిలో కన్ను కొడితే మూడో కంటికి తెలియకుండా వేసేయాలి. తెల్లారేక మనమే వెళ్ళి పరామర్శించాలి. అంతే తప్ప ఊరకే రప్పా రప్పా అంటూ గొంతు చించుకోవడం కాదు,” అంటూ అనుచరులకు హితోపదేశం చేశారు. కనుక పేర్ని నాని కూడా ప్రత్యర్ధులను వేసేయవచ్చని చెపుతున్నట్లు స్పష్టమవుతోంది.

ADVERTISEMENT

కార్యకర్తలకు మార్గదర్శనం చేయాల్సిన అధినేత జగన్‌, పేర్ని నాని వంటి సీనియర్లు ఈవిదంగా ప్రోత్సహిస్తుంటే, కార్యకర్తలు చేతులు ముడుచుకు కూర్చోంటారా?కూర్చోరు. కనుకనే కేసులు నమోదవుతున్నాయని స్పష్టమవుతోంది.

పేర్ని నాని వైసీపీ కార్యకర్తలకు చేసిన ఈ హితోపదేశాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణించారు. కృష్ణా జిల్లా పామర్రు పోలీస్ స్టేషన్‌లో ఆయనపై కేసు నమోదు చేశారు.

ఈ విషయం తెలిసి అయన ముందస్తు బెయిల్‌ కోసం హైకోర్టుని ఆశ్రయించారు. కనీసం మధ్యంతర రక్షణ కల్పించాలని కోరారు. కానీ హైకోర్టు ఆయన పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా వేసింది.

ఈ పోలీసులు, కేసులు, అరెస్టులు అంటే భయం లేదని ప్రగల్భాలు పలికిన పేర్ని నాని కూడా అరెస్ట్‌ భయంతో జంప్ అయిపోయారు.

ప్రస్తుతం పోలీసులు ఆయన కోసం గాలిస్తున్నారు. రేపు ముందస్తు బెయిల్‌ మంజూరు అయితే మళ్ళీ ప్రత్యక్షమవుతారు… లేకుంటే లేదు!

ADVERTISEMENT
Latest Stories