పోలవరం ఇక కాసులు రాల్చదు… ఇప్పుడెలా?

Polavaram-Dam-Projectపోలవరం ప్రాజెక్టు ఏపీలో ప్రభుత్వాలకి కాసులు రాల్చే ఏటిఎం కార్డులా మారిపోయిందనే విమర్శలు చాలా కాలం నుంచే వినిపిస్తున్నాయి. అయితే ఇక పోలవరం ప్రాజెక్టుకి కాసులు రాల్చే ప్రసక్తే లేదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పేసింది. 2017-2018 ధరల ప్రకారం సవరించిన అంచనా వ్యయం రూ.55,548.87 కోట్లుగా రాష్ట్ర ప్రభుత్వం లెక్కగట్టగా కేంద్ర ప్రభుత్వం ఆ లెక్కలను, అంచనా వ్యయాన్ని నిర్ద్వందంగా తిరస్కరించింది.

ADVERTISEMENT

పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సహాయసహకారాలు అందిస్తున్నప్పటికీ అనేక కారణాల చేత దానిని నత్తనడకలు నడిపిస్తూ ఆలస్యం చేసినందునే ప్రాజెక్టు అంచనా వ్యయం గణనీయంగా పెరిగిపోయిందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.

కనుక 2013-14 ధరల ప్రకారమే ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.20,398.61 కోట్లు మాత్రమే అని నిర్దారించింది. దానిలో ఇప్పటికే రూ.12,747.16 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించినందున మిగిలిన రూ.2,920.74 కోట్లు మాత్రమే ఇస్తామని కేంద్రం తేల్చి చెప్పింది. ఈ వివరాలను పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) డ్యాష్‌ బోర్డులో పొందుపరిచింది.

ఇది జగన్ ప్రభుత్వానికి చాలా పెద్ద షాక్ అనే చెప్పవచ్చు. ఎందుకంటే, సవరించిన అంచనా వ్యయం రూ.55,548.87 కోట్లలో కేంద్ర ప్రభుత్వం సూచిస్తున్న విధంగా 2013-14 ధరల ప్రకారమే ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.20,398.61 కోట్లు మినహాయించుకొని మిగిలిన రూ.35,150.26 కోట్లు ఇవ్వాలని కోరుతోంది. కానీ రూ.2,920.74 కోట్లు మాత్రమే ఇస్తామని కేంద్రం తేల్చి చెప్పింది.

ఏపీలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడుపై కక్షతో రివర్స్ టెండరింగ్ అంటూ పోలవరం ప్రాజెక్టు పనులు నిలిపివేసింది. ఆ తర్వాత డయాఫ్రం వాల్ దెబ్బతిందని వాదిస్తూ ఇంతకాలం కాలక్షేపం చేసింది.

పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి కేంద్ర ప్రభుత్వం దానికి వేలకోట్లు నిధులు సమకూరుస్తున్నందున, నిపుణుల బృందాన్ని పంపించి నివేదిక తెప్పించుకొంది. ప్రభుత్వం, కాంట్రాక్ట్ కంపెనీల అసమర్దత, అలసత్వం, సమన్వయలోపం, సరైన ప్లానింగ్ లేకపోవడం వంటి అనేక కారణాలతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు నత్తనడకలు నడుస్తున్నాయని నివేదిక ఇచ్చింది.

వేలకోట్లు ఇస్తున్నా ప్రాజెక్టు పూర్తిచేయడంలో జగన్ ప్రభుత్వం అశ్రద్ద కనబరుస్తోందని నిర్దారించుకొని కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్టు నుంచి బయటకు వెళ్లిపోయేందుకు సిద్దపడుతోంది. అదే కనుక జరిగితే, రాజధాని అమరావతిలాగే పోలవరం ప్రాజెక్టు కూడా మన ప్రభుత్వ అసమర్దతకు నిదర్శనంగా మొండి గోడలతో నిలిచిపోయి వెక్కిరిస్తుంటుంది.

ADVERTISEMENT
Latest Stories