మన దేశంలో అన్నదానం అనేది ఓ పవిత్రమైన దైవకార్యంగా భావిస్తుంటారు. కానీ వైసీపీ ప్రభుత్వం దానికీ అడ్డుపడుతోంది. టిడిపి హయాంలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లన్నిటినీ కేవలం చంద్రబాబు నాయుడుపై ద్వేషంతో జగన్ అధికారంలోకి రాగానే మూయించేశారు. ఇప్పుడు టిడిపి నేతలు తాత్కాలికంగా టెంట్లు వేసి అన్నా క్యాంటీన్లు పెట్టి పేదలకు అన్నదానం చేస్తుంటే వాటినీ అడ్డుకొంటోది.
టిడిపి ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకొంటుందేమో అని భయం. దాంతో వైసీపీకి రాజకీయంగా నష్టం జరుగుతుంది కనుక భయపడటం సహజమే.
చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ జిల్లాలలో పర్యటిస్తే వైసీపీకి వెన్నులో వణుకు మొదలవుతుంది. వారి పర్యటనలతో ప్రజలను ఆకట్టుకొంటే వైసీపీకి నష్టం కలుగుతుంది కనుక దానికీ భయపడటం సహజమే.
కానీ ప్రభుత్వం చేయవలసిన పనిని టిడిపి నేతలు సొంత డబ్బుతో అన్నా క్యాంటీన్లు పెట్టి నిరుపేదలకు అన్నం పెడుతుంటే వైసీపీ ఎందుకు ఆందోళన చెందుతోంది?ఎందుకు అడ్డుకొంటోంది?అంటే ద్వేషం, వాటితో టిడిపికి ప్రజలలో ఎక్కడ మంచి పేరు వచ్చేస్తుందో అనే భయం తప్ప మరో కారణం కనబడదు.
ఇటీవల కుప్పంలో వైసీపీ కార్యకర్తలు అన్నా క్యాంటీన్‌పై దాడి చేసి ధ్వంసం చేయడం అందరూ చూశారు. తాజాగా గుంటూరు జిల్లా తెనాలిలో మున్సిపల్ కాంప్లెక్స్ వద్ద ఈ నెల 12న టిడిపి నేతలు అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసి పేదలకు అన్నం పెడుతుంటే, వైసీపీ నేతలు కూడా దానికెదురుగా పోటీగా మరో క్యాంటీన్ ఏర్పాటు చేశారు. పేదలకు కడుపు నిండా అన్నం పెట్టాలనే వారి ఉద్దేశ్యమైతే ఎవరైనా స్వాగతించేవారు. కానీ టిడిపి శ్రేణులతో గొడవ పెట్టుకొనేందుకే అక్కడ క్యాంటీన్ పేరుతో టెంట్ వేశారని అర్దమవుతూనే ఉంది. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
అక్కడ క్యాంటీన్ పెట్టడం వలన ట్రాఫిక్ సమస్యలు వస్తున్నాయని కనుక తొలగించాలని మున్సిపల్ అధికారులు టిడిపి నేతలకు నోటీసులు ఇచ్చారు. శనివారం మధ్యాహ్నం పోలీసులు టిడిపి నేతలు నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ వద్దకు వచ్చి అడ్డుకొన్నారు. వండిన కూరలు తెస్తున్న ఆటోని అడ్డగించి దానిలో కూరలన్నీ పోలీసులు పట్టుకుపోయారు. ఈ సందర్భంగా పోలీసులకు, టిడిపి నేతలకు మద్య తీవ్ర వాగ్వాదాలు జరగడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
కూరలు లేకపోయినప్పటికీ టిడిపి నేతలు అన్నం, సాంబారే అందరికీ పంపిణీ చేశారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తర్వాత పోలీసులు వైసీపీ టెంట్ కూడా తొలగించారు. కానీ టిడిపి అన్నా క్యాంటీన్‌ను అక్కడి నుంచి పూర్తిగా తొలగించేవరకు కదలమని వైసీపీ నేతలు భీష్మించుకొని కూర్చోవడంతో ముందు జాగ్రత చర్యగా ఆ ప్రాంతంలో భారీగా పోలీసులను మోహరించి, దుకాణాలను మూయించివేశారు. మున్సిపల్ కాంప్లెక్స్ చుట్టుపక్కల ప్రాంతాలలో బారికేడ్లు కూడా ఏర్పాటు చేసి టిడిపి, వైసీపీ కార్యకర్తలు ఎవరూ అక్కడికి రాకుండా అడ్డుకొంటున్నారు.
తెనాలిలో అన్నా క్యాంటీన్‌ను పోలీసులు అడ్డుకోవడంపై టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ చాలా తీవ్రంగా స్పందించారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, “అన్నం తినేవారెవరూ అన్నా క్యాంటీన్లను అడ్డుకోవాలనుకోరు. ఇదివరకు నందిగామ, మంగళగిరి, కుప్పంలో అడ్డుకొన్నారు. ఇప్పుడు తెనాలిలో అడ్డుకొంటున్నారు. సిఎం జగన్మోహన్ రెడ్డికి మానవత్వం అనేదే లేదా?మా నేతలు వారి సొంత డబ్బుతో పేదలకి అన్నం పెడుతుంటే మద్యలో మీకెందుకు అభ్యంతరం?మీ ప్రభుత్వం చేయలేని పనిని మేము చేస్తున్నామనా?మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా అన్నా క్యాంటీన్లు నిర్వహించి తీరుతాము. వాటితో పేదల ఆకలి తీరుస్తాం,” అని అన్నారు.



