అమరావతి జనులా… హతవిధి..!

Police Lathi Charge on Amaravati Farmersగత రెండేళ్లుగా అమరావతి ప్రాంత ప్రజలకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్న వైసీపీ ప్రభుత్వం, ఇప్పట్లో వారిని కనికరించే ఉద్దేశం లేదన్న విషయాన్ని ఈ రోజు మరోసారి విస్పష్టంగా చెప్పకనే చెప్పింది. అమరావతినే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా కొనసాగించాలని కోరుతూ భూములు ఇచ్చిన రైతులు, మహిళలు గత కొన్ని రోజులుగా మహాపాదయాత్ర చేస్తున్న విషయం విదితమే.

‘న్యాయస్థానం టు దేవస్థానం’ పేరుతో సాగుతోన్న ఈ పాదయాత్ర ప్రస్తుతం ప్రకాశం జిల్లాకు చేరింది. శాంతియుతంగా సాగుతోన్న ఈ పాదయాత్రలో నేడు ‘అశాంతి’ చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిందని, ఈ పాదయాత్రలో రాజకీయ పార్టీలు పాల్గొనరాదని ముందుగా జేఏసీ సంఘాలకు నోటీసులు ఇచ్చిన పోలీసు వర్గాలు, తదుపరి చర్యగా ఏకంగా లాఠీఛార్జ్ చేసారు.

ADVERTISEMENT

తాము రాజకీయ పార్టీలతో నిమిత్తం లేకుండా పాదయాత్ర చేస్తున్నామని, నోటీసులు ఇవ్వదలుచుకుంటే రాజకీయ పార్టీలకు సదరు సూచనలు చేయాల్సిందిగా కోరిన జేఏసీ సభ్యులు, ఈ రోజు ఉద్రిక్తల నడుమే పాదయాత్రను కొనసాగించారు. అయితే సంతనూతలపాడుకు చేరుకున్న ఆ పాదయాత్రను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా, ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో పోలీసులు తమ లాఠీలకు పని చెప్పారు.

నిజానికి అమరావతి ప్రాంత ప్రజలపై లాఠీచార్జ్ చేయడం ఇదే ప్రధమం కాదు. ఐడి కార్డులు లేకుండా, పోలీస్ డ్రెస్ లు వేసుకొచ్చి తమపై అమానుషంగా దాడులు చేసారని గతంలో మీడియా సాక్షిగా అమరావతి ప్రజలు గొంతు చించుకున్న వైనం తెలియనిది కాదు. తెలుగుదేశం పార్టీతో గాని, సదరు నేతలతో గానీ రాజకీయం వైరం ఉంటే, వారితో చూసుకోవాలి గానీ, సామాన్య ప్రజానీకాన్ని ఇబ్బందులకు గురిచేయడం సరికాదని వాపోవడం అమరావతి ప్రాంత ప్రజల వంతవుతోంది.

ADVERTISEMENT
Latest Stories