దాడులు చేసేది వైసీపీ… అరెస్ట్‌ చేసేది టిడిపి కార్యకర్తలనా?

Police-Notice-To-Nara-Lokeshటిడిపి యువనేత నారా లోకేష్‌ పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలంలో తాడేరులో బుదవారం యువగళం పాదయాత్ర చేస్తున్నప్పుడు చుట్టుపక్కల భవనాలపై నుంచి వైసీపీ కార్యకర్తలు రాళ్ళు, సోడా బాటిల్స్ తో దాడులు చేశారు. అయితే పోలీసులు దాడులకు పాల్పడిన వైసీపీ కార్యకర్తలను కాక, యువగళం వాలంటీర్లను అరెస్ట్‌ చేశారు.

ADVERTISEMENT

నిన్న రాత్రి సుమారు 50 మందిని అరెస్ట్‌ చేసి మూడు వ్యాన్లలలో ఎక్కించుకొని రాత్రంతా రోడ్లపైనే తిప్పారని యువగళం వాలంటీర్లు ఆరోపించారు. తమను ఇష్టం వచ్చిన్నట్లు కొడుతూ, బూతులు తిడుతూ, నారా లోకేష్‌ తమని వైసీపీ కార్యకర్తలపై దాడులు చేయమన్నారని చెప్పవలసిందిగా ఒత్తిడి చేశారని వాలంటీర్లు చెప్పారు.

పోలీసులు వారందరినీ ఓ వైసీపీ నేతకు చెందిన ఐస్‌ ఫ్యాక్టరీలోకి తీసుకువెళ్ళారని సమాచారం అందగానే టిడిపి నేతలు పరుగున అక్కడికి వెళ్ళగా అక్కడ వారిని పోలీసులు అడ్డుకొన్నారు. వారిని ఐస్‌ ఫ్యాక్టరీలో ఎందుకు బందించారని టిడిపి నేతలు ప్రశ్నించగా, వారందరికీ టిఫిన్ పెట్టించేందుకు లోనికి తీసుకువెళ్ళామని ఇన్‌స్పెక్టర్ విచిత్రమైన సమాధానం చెప్పారు. కాఫీ, టిఫిన్లు ఇప్పించాలనుకొంటే పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్ళి అక్కడ పెట్టించాలి కానీ వైసీపీ నేతకు చెందిన ఐస్‌ ఫ్యాక్టరీలో దేనికని టిడిపి నేతలు ప్రశ్నించగా సమాధానం దాటవేసి వారిని బలవంతంగా బయటకు పంపించేశారు.

నారా లోకేష్‌పై కూడా పోలీసులు కేసు నమోదు చేసేందుకు నోటీస్ ఇచ్చారు. భీమవరం సీఐ నాగప్రసాద్ బేతపూడిలోని క్యాంప్ సైటుకి వెళ్ళి యువగళం పాదయాత్రలో మీరు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు నోటీస్ ఇస్తున్నట్లు చెప్పగా, నారా లోకేష్‌ ఆయనకే క్లాసు పీకడం విశేషం.

సిఎం జగన్‌ పలు సందర్భాలలో చంద్రబాబు నాయుడుని ఉద్దేశ్యించి అనుచితంగా మాట్లాడిన మాటలను, పాదయాత్రలో వైసీపీ నేతలు, కార్యకర్తలు కవ్వింపు చర్యలను, నిన్న తమపై దాడి చేయడం గురించి వివరించి, వైసీపీ కార్యకర్తలను అరెస్ట్‌ చేయకుండా, యువగళం వాలంటీర్లను ఎందుకు అరెస్ట్‌ చేశారని ప్రశ్నించారు. తాను జగన్‌ గురించి అన్నీ వాస్తవాలే చెపుతున్నాను తప్ప ఏనాడూ ఆయనలాగ అనుచితంగా మాట్లాడలేదని అన్నారు.

తమపై వైసీపీ కార్యకర్తలు దాడులు చేస్తుంటే, తమని కవ్విస్తుంటే వారిని ఎందుకు అడ్డుకోవడం లేదని నారా లోకేష్‌ ప్రశ్నించారు. తాను ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళేందుకు పాదయాత్ర చేస్తున్నాను తప్ప రాష్ట్రంలో అల్లర్లు సృష్టించడానికి కాదని, తనకు ఆ అవసరం, ఉద్దేశ్యం కూడా లేవని నారా లోకేష్‌ స్పష్టం చేశారు. తాను ఇప్పటి వరకు 15 జిల్లాలలో పాదయాత్ర చేసినప్పుడు జరుగని గొడవలు భీమవరంలోనే ఎందుకు జరుగుతున్నాయని, దీనికి పోలీసులు, వైసీపీయే బాధ్యత వహించాలి కదా? అని నారా లోకేష్‌ ప్రశ్నకు భీమవరం సీఐ నాగప్రసాద్ సమాధానం చెప్పలేదు.

నిన్న తాడేరులో భవనాలపై వైసీపీ కార్యకర్తలు తమపై దాడి చేసేందుకు సిద్దం చేసి ఉంచుకొన్న సోడా బాటిల్స్ ఫోటోలను, వైసీపీ కార్యకర్తలకు అండగా నిలబడిన పోలీసుల ఫోటోలను కూడా ప్రింట్ తీసి ఆయన చేతికిచ్చి, మాపై దాడి చేసిన వైసీపీ కార్యకర్తలు, వారి వెనుక ఉన్న వైసీపీ నేతలపైనే కేసు నమోదు చేసి వారందరినీ అరెస్ట్‌ చేయాలని నారా లోకేష్‌ డిమాండ్‌ చేశారు. పోలీసులు డా.అంబేడ్కర్‌ రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలీ కానీ రాజారెడ్డి రాజ్యాంగం ప్రకారం కాదని నారా లోకేష్‌ భీమవరం సీఐ నాగప్రసాద్‌కు హితవు చెప్పారు.

ADVERTISEMENT
Latest Stories