
కొన్నిసార్లు రాజకీయ సమీకరణాలు, అవసరాలు, పొత్తుల కారణంగా కొన్ని అంశాలపై కొన్ని పార్టీలు మాట్లాడలేని పరిస్థితి నెలకొంటుంది.
జనాభా ప్రాతిపదికన లోక్‌సభ నియోజకవర్గాలను పునర్విభజించాలనే ప్రతిపాదనతో జనాభా నియంత్రణ పాటిస్తూ, తక్కువ జనాభా కలిగిన దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గట్టిగా వాదిస్తున్నారు.
Also Read – ఓటమి ఒప్పుకోవడం, బాధ్యత వహించడం చంద్రబాబుకే చెల్లు!
రెండు జాతీయ పార్టీలపై ఆయన పార్టీ డీఎంకె ఆధారపడి ఉండకపోవడం వల్లనే ఈ అంశంపై ధైర్యంగా మాట్లాడగలుగుతున్నారు. కనుక ఈ నెల 22న చెన్నైలో దేశంలో అన్ని పార్టీలను, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలలో పార్టీలతో ఓ సమావేశం నిర్వహించబోతున్నారు. అంటే ఈ విషయంలో ఆయన లీడ్ తీసుకుంటున్నారన్న మాట!
ఈ అంశంపై గట్టిగా తన అభిప్రాయం చెపుతున్న తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి వద్దకు తన పార్టీ ముఖ్య నేతలను పంపించి ఈ సమావేశంలో పాల్గొనవలసిందిగా ఆహ్వానించారు. ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. కానీ కాంగ్రెస్ అధిష్టానం అనుమతిస్తే వస్తానని చెప్పారు.
Also Read – జగన్, చంద్రబాబు: ఇద్దరు భక్తుల కధ!
ఈ ప్రతిపాదనని మోడీ ప్రభుత్వం చేస్తోంది కనుక కాంగ్రెస్ అధిష్టానం తప్పకుండా వ్యతిరేకయిస్తుంది. కనుక రేవంత్ రెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం ఉందనే భావించవచ్చు.
ఇక ముందే చెప్పుకున్నట్లు ఏపీలో టీడీపీ, జనసేనలు బీజేపితో కలిసి ఉన్నాయి కనుక ఈ ప్రతిపాదనని వ్యతిరేకించలేవు. రెండు పార్టీలు ఈ సమావేశానికి హాజరు కాకపోవచ్చు. ఒకవేళ కాంగ్రెస్ అధిష్టానం ఈ అంశంపై తమ పార్టీ వైఖరి స్పష్టం చేస్తే ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా వెళ్ళి పాల్గొనవచ్చు.
Also Read – ప్రభుత్వాలకు ఆర్ధిక ఇబ్బందులు…ఎందుకీ పరిస్థితి.?
ఈ విషయంలో రాష్ట్రంలో నాలుగు పార్టీలకు స్పష్టత ఉంది. కానీ ఏపీలో వైసీపీకి బీజేపితో ప్రత్యక్షంగా ఎటువంటి సంబందమూ లేనప్పటికీ, మోడీ, అమిత్ షాలకు ఆగ్రహం కలిగించే పనులు చేయలేరు. కనుక ఒకవేళ డిఎంకె నేతలు ఒకవేళ ఆహ్వానించినా జగన్ ఈ సమావేశానికి హాజరు కాకపోవచ్చు.
తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలని చాలా ఆశపడుతున్నారు. కానీ ఒంటెత్తు పోకడల వలన ఎవరూ ఆయనతో కలిసి పనిచేసేందుకు ఇష్టపడటం లేదు. కనుక ఇటువంటి అవకాశం కోసమే కేసీఆర్ ఎదురుచూస్తున్నారు. పైగా స్టాలిన్‌తో కేసీఆర్‌కి సత్సంబంధాలు ఉన్నాయి. కనుక ఒకవేళ ఆహ్వానిస్తే కేసీఆర్ ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉంది.
కానీ దేశానికి, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు, ప్రజలకు సంబందించిన ఇటువంటి అంశంపై చర్చించేందుకు ఈవిదంగా రాజకీయ లెక్కలు చూసుకోవాల్సి రావడం బాధాకరమేగా!