రాజకీయ నాయకుల మీద కేసులు జమ్మిచెట్టు మీద దాచిన అస్త్రాలైనా.?

Political Cases India

రాజకీయ నాయకుల మీద ప్రభుత్వాలు పెట్టె కేసులన్నీ కూడా జమ్మి చెట్టు మీద దాచిన అస్త్రాలు గా మారిపోవడం సర్వ సహజమైపోతుందా.? అధికారంలోకి వచ్చిన పార్టీలు గత పాలకుల అవినీతి అంటూ కమిటీలు ఏర్పాటు చేసి, విచారణలు జరిపి, వాటిని కేసుల రూపంలోకి మార్చి చివరికి వాటిని తమ రాజకీయ అవసరాల కోసం దాచి ఉంచడం నేటి జమానా రాజకీయంలో భాగమైపోయింది.

ఇందుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద నాటి కాంగ్రెస్ సర్కార్ పెట్టిన పదుల సంఖ్యలో కేసులు ఇప్పటికి ఒక కొలిక్కి రాలేదు. కనీసం కేసుల విచారణ కోసం జగన్ కోర్టులకు కూడా వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయింది.

ADVERTISEMENT

గత దశాబ్ద కాలం నుండి జగన్ బెయిలు మీద ఉంటూ రాజకీయాలు చేస్తున్నారు అంటే రాజకీయ నాయకుల మీద ప్రభుత్వాలు పెట్టె కేసులు ఎంత బలహీనంగా ఉంటాయో.? వాటి విచారణలు ఎంత నత్త నడకన సాగుతున్నాయో యిట్టె అర్ధమవుతుంది.

అలాగే ప్రభుత్వాలు తలచుకుంటే అవే కేసులు ఎంత బలంగా మారిపోతాయి.? దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న నాయకులను సైతం ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఏ విధంగా కటకటాల వెనక్కి నెట్టగలవు అనేది చంద్రబాబు నాయుడు పై వైసీపీ ప్రభుత్వం పెట్టిన కేసులు, ఆ తరువాత జరిగిన అరెస్టులు, బైళ్ల పరిణామాలతో ఇట్టే అవగతం అవుతుంది.

ఇక కాళేశ్వరం లో అవినీతి అంటూ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ జలవనరుల శాఖ మంత్రి హరీష్ రావు, ఫార్ములా ఈ కార్ రేసింగ్, ఫోన్ టాపింగ్ అంటూ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై రేవంత్ సర్కార్ నమోదు చేసిన కేసులు అరెస్టుల వరకు సాగుతాయా.? లేదా విచారణతో ముగుస్తాయా.? లేదా రాజకీయ పార్టీల అవసరానికి అస్త్రాలుగా తయారవుతాయా.?

ఇక గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో నేటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ పై నమోదైన ఓటుకి నోటు కేసు ఇప్పటికి రేవంత్ ప్రత్యర్థి పార్టీలకు ఒక రాజకీయ అస్త్రంగా నే మిగిలింది. ఈ కేసులన్నీ ఏనాటికి కొలిక్కి వస్తాయి.?

ఇందులో దోషులుగా ఆరోపణలు ఎదుర్కుంటున్న రాజకీయ నాయకులు తమ నిర్దోషత్వాన్ని నిరూపించుకోగలరా.? అలాగే ప్రభుత్వాలు తమ హయాంలో ప్రత్యర్థి పార్టీ నేతలు పై పెట్టిన కేసులు రాజకీయ కక్ష్య సాధింపు చర్యలలో భాగం కాదని రుజువు చేసుకోగలవా.?

ADVERTISEMENT
Latest Stories