సజ్జల ప్రశ్నకు కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పగలదా?

Political Corruption Cases in AP

జగన్‌ అక్రమాస్తుల కేసులు, వివేకానంద హత్య కేసుల విచారణ ఏళ్ళ తరబడి సాగుతునే ఉన్నాయి. ఈ కేసులు ఇలాగే మరికొన్నేళ్ళు కొనసాగిస్తూ కేంద్రంలో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారి అనుకూల పరిస్థితి ఏర్పడినప్పుడు ఒక్కో కేసుని కొట్టివేసినా ఆశ్చర్యం లేదు.

ఉదాహరణకు ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కేంద్ర ప్రభుత్వం చాలా మందిని జైల్లో వేసింది. కానీ తర్వాత ఒకరొకరుగా అందరూ బెయిల్‌పై బయటకు వచ్చేశారు.

ADVERTISEMENT

తీహార్ జైలు నుంచి బెయిల్‌పై బయటపడిన కల్వకుంట్ల కవిత ‘ఇది రాజకీయ కక్షతో సృష్టించిన కల్పిత కేసు మాత్రమేనని నేను మొదటి నుంచి చెపుతూనే ఉన్నాను. నేను అవినీతికి పాల్పడ్డానని సీబీఐ, ఈడీ నాపై కేసు పెట్టాయి. కానీ నా నుంచి ఒక్క రూపాయి తీసుకోలేకపోయాయి. చివరికి న్యాయం ధర్మం గెలిచింది,’ అన్నారు.

ఢిల్లీలో ఆమాద్మీ ప్రభుత్వం స్థానంలో బీజేపి ప్రభుత్వం ఏర్పాటు కాగానే ఈ లిక్కర్ కేసు అటకెక్కిపోయింది. కనుక ఆమె వాదనలే నిజమనుకోవాలి.

కాదంటే అవినీతికి పాల్పడిన వారందరినీ ఎందుకు విడిచిపెట్టేశారు? వారు అవినీతికి పాల్పడ్డారని ఎందుకు నిరూపించడం లేదు?వారికి శిక్షలు ఎందుకు పడటం లేదు? అనే ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వం, ఈడీ, సీబీఐలే సమాధానం చెప్పాల్సి ఉంటుంది.

ఇప్పుడు కూటమి ప్రభుత్వం హయంలో తిరుమల కల్తీ నెయ్యి, మద్యం కుంభకోణం, కల్తీ మద్యం, పేర్ని నాని గోదాములలో రేషన్ బియ్యం మాయమవడం, కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం విదేశాలకు అక్రమ రవాణా చేసినందుకు కేసులు నమోదయ్యాయి. ఇవే కాక కనీసం మరో 20-30 కేసులు నడుస్తున్నాయి.

కానీ ఈ కేసులన్నీ కూడా పైన పేర్కొన్న కేసుల్లాగే నత్త నడకలు నడుస్తున్నాయి. ఎందుకంటే “ఇవన్నీ రాజకీయ కక్షతో పెట్టిన తప్పుడు కేసులే. వాటిలో అవినీతి, నేరం జరిగిందని సిట్ కోర్టులో నిరూపించలేదు కనుక,” అని వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణ తేల్చిచెప్పేశారు.

ఈ కేసులు తమని రాజకీయంగా వేదించడానికే తప్ప తాము ఎటువంటి తప్పు, అవినీతికి పాల్పడలేదని సజ్జల కుండ బద్దలు కొట్టారు.

కనుక ఈ కేసులున్నీ కూడా ఇలాగే మరి కొన్నేళ్ళు సాగి రాజకీయ సమీకరణలు లేదా ప్రభుత్వాలు మారినప్పుడు మెల్లగా అటకెక్కిపోతాయనుకోవచ్చు. కేసు నమోదు మొదలు నిందితులు బెయిల్‌పై బయటకు వచ్చేసి మళ్ళీ అధికారం చేపట్టడం వరకు రాజకీయాలలో పరిపాటిగా మారిపోయింది. ఇదీ ఓ రాజకీయ పద్దతిగా మారిపోయిందని చెప్పక తప్పదు.

ఇలా ఏ కేసులోనూ దోషులను గుర్తించి శిక్షించలేనప్పుడు ఈ కేసుల విచారణ పేరుతో పోలీసులు, అధికారులు, కోర్టులు, న్యాయవాదులు, న్యాయమూర్తుల శ్రమ, వీటి కోసం వందల కోట్లు ఖర్చు అంతా వృధాయే కదా?

లడ్డూ, లిక్కర్ స్కామ్‌ విచారణ పురోగతి ఏమైందని వైసీపీ తరపున సజ్జల రామకృష్ణా రెడ్డి ప్రశ్నిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఆయనకు జవాబు చెప్పగలదా?

ADVERTISEMENT
Latest Stories