రాజకీయాలలో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు అనే నానుడి మాదిరే రాజకీయాలలో తప్పులుండవ్…తప్పించుకోవడాలే అంటున్నాయి రాజకీయ పార్టీలు. అధికారంలో ఉన్నప్పుడు ఒక లెక్క ప్రతిపక్షంలోకి వచ్చాక మరో లెక్క అన్నట్టు నడుచుకుంటున్నారు పార్టీల అధినేతలు.
తాము అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలు, అవలంబించిన విధానాలు నేడు ప్రతిపక్షంలోకి రాగానే తప్పుగా తోస్తున్నాయి, వాటిని ఆయా పార్టీల నాయకులు తప్పని వాదిస్తున్నారు. అలాగే ప్రజలను నమ్మించే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఉదాహరణకు పార్టీ ఫిరాయింపు నాయకుల విషయంలో గతంలో వాటిని భారీ స్థాయిలో ప్రోత్సహించి, మోతాదుకు మించి గులాబీ కారుని నింపి తెలంగాణలో ప్రతిపక్షం అనే మాటే లేకుండా చేసిన బిఆర్ఎస్ ఇప్పుడు ఫిరాయింపులు నేరమంటూ కోర్టులను ఆశ్రయించింది.
అలాగే ఇటు ఏపీ విషయానికొస్తే తమ ప్రభుత్వ హయాంలో, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రకటన చేసినందుకు గాను తమ సొంత పార్టీ ఎంపీ ని సైతం అరెస్టు చేసి లాఠీదెబ్బలు రుచి చూపించిన వైసీపీ ఇప్పుడు తమ పార్టీ నేతల అరెస్టులను అక్రమం అంటూ ఖండిస్తూ పరామర్శలు, ఓదార్పులు అంటూ నానా హంగామా చేస్తుంది.
నాడు రాష్ట్రంలో ప్రతిపక్షమనేదే ఉండకూడదు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నోరు విప్పే నాయకుడే కనిపించకూడదు అంటూ నియంత పాలన చేసిన ఈ రెండు పార్టీలు బిఆర్ఎస్, వైసీపీ లు ఇప్పుడు ప్రతిపక్ష హక్కుల కోసం గళం విప్పుతున్నాయి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కథం తొక్కుతున్నాయి.
నాడు తెలంగాణలో రేవంత్ రెడ్డి అరెస్టు సక్రమం అంటూ సమర్ధించుకున్న బిఆర్ఎస్ నేడు కేటీఆర్, కేసీఆర్ మీద పడుతున్న కేసులు అక్రమమని వాదిస్తుంది. అలాగే ఇటు ఏపీలో నాడు బాబు అరెస్టు సహేతుకం అంటూ రెచ్చిపోయిన వైసీపీ నేడు లిక్కర్ స్కాం నుంచి అక్రమ మైనింగ్ వరకు వైసీపీ నాయకుల అరెస్టులను కక్ష్య రాజకీయాలలో భాగమంటూ కొట్టిపారేస్తుంది.
నాడు మామకు వెన్నుపోటు అంటూ బాబు ను నిందించిన బిఆర్ఎస్, వైసీపీ లు నేడు సొంత చెల్లెల్లు షర్మిల, కవిత లకు అధికార పోటు పొడిచారు, అవినీతి మరక వేశారు. వీటన్నింటిని పరిశీలనలోకి తీసుకుని చూస్తే రాజకీయాలలో తప్పులుండవు కేవలం తప్పించుకోవడం మాత్రం తెలిసుంటే చాలు అనే భావన ప్రతి సామాన్యుడికి కలుగుతుంది.






