కాలం ఎంత విలువైనదో అంతే బలమైనది కూడా. ప్రస్తుత కర్మలకు తగ్గ ఫలితం కాలం తప్పక ఇస్తుంది అని హిందూ సమాజం చాల బలంగా నమ్ముతుంది. అయితే ఇప్పుడు ఆ కాలం విలువ అది కొట్టే దెబ్బ తాలూకా బలం ఎలా ఉంటుంది అనేది వైసీపీ కి, బిఆర్ఎస్ కి చాల గట్టిగా తెలిసొస్తుంది.
సరిగ్గా ఆరేళ్ళ క్రితం ఇదే వైసీపీ అదే అసెంబ్లీ లో తన 151 ఎమ్మెల్యే ల బలంతో రెచ్చిపోయింది, ప్రత్యర్థి పార్టీల నేతలను రెచ్చకొట్టింది. కట్ చేస్తే ఇప్పుడు ఆ 151 కాస్త 11 గా మరింది. నాటి బలమే నేడు భయంగా రూపం మార్చుకుంది. ఇక నాడు బూతులతో రెచ్చిపోయి రంకెలేసిన వైసీపీ నేతలు నేడు రాష్ట్రం దాటి పోయారు.
అలాగే పదేళ్ల కాలం వెనక్కెళితే ప్రత్యేక తెలంగాణ సాధన తరువాత ఇదే బిఆర్ఎస్ ప్రత్యర్థి పార్టీల నాయకులందరినీ తన గులాబీ కారెక్కించేసింది, తెలంగాణలో ప్రతిపక్షం అనేదే లేకుండా చేసేసింది. మరి ఇప్పుడు అదే బిఆర్ఎస్ స్వపక్షంలోనే కవిత రూపంలో విపక్షాన్ని సృష్టించుకుంది.
ఇక వైసీపీ విషయానికొస్తే., అధికారంలో ఉన్న ఐదేళ్లు మీ పార్టీలోని నలుగురు ఎమ్మెల్యేలను మా పార్టీలోకి లాగేస్తే టీడీపీ కి ప్రతిపక్ష పార్టీ స్థాయి కానీ, చంద్రబాబు నాయుడికి ప్రతిపక్ష నేత హోదా కానీ మిగలదు అంటూ వైస్ జగన్ హేళన చేసారు.
చివరికి ఐదేళ్ళు గడిచిన తరువాత ఇదే వైసీపీ ఇదే వైస్ జగన్ నాకు, నా పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అంటూ అదే చంద్రబాబు ముందు నిల్చున్నారు. అలాగే వైసీపీ హయాంలో అమరావతిని సమాధి చెయ్యడానికి విశ్వ ప్రయత్నాలు చేసారు, కానీ నేడు అదే అమరావతి విశ్వ నగరం గా రూపొందనుంది.
నాడు టి.టీడీపీ ని తెరాస లో విలీనం చేసుకున్నాం, ఇక తెలంగాణలో టీడీపీ లేదు అంటూ జబ్బలు చరుచుకున్న బిఆర్ఎస్ ఇప్పుడు బీజేపీలో విలీనానికి సిద్దమయ్యింది అనే ఆరోపణలతో అల్లాడుతోంది. అలాగే నాడు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ రేవంత్ రెడ్డి ని అరెస్టు చేసి టీడీపీ ని చావు దెబ్బ కొట్టాం అంటూ సంబరపడింది.
అయితే ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి నుంచి అరెస్టు భయంతో కేసీఆర్, కేటీఆర్, హరీష్ వంటి కీలక నేతలు బీజేపీ తో తెరచాటు రాజకీయం నడుపుతున్నారు. నాడు వైసీపీ మూడు రాజధానులు అంటూ మూడు ప్రాంతాల ఓటు బ్యాంకు కోసం చీలిక రాజకీయాలు చేస్తే నేడు అదే మూడు ప్రాంతాలలో వైసీపీ ని ప్రజలు చీల్చి చెండాడారు.
ఇక బిఆర్ఎస్…రేవంత్ రెడ్డి కేసీఆర్ కాలిగోటికి సరిపోడు, కేసీఆర్ ను విమర్శించే స్థాయి రేవంత్ కు లేదు అంటూ రేవంత్ రెడ్డి ని కించపరిచే రాజకీయం చేసింది. కట్ చేస్తే ఇప్పుడు రేవంత్ ను ముఖ్యమంత్రిగా ఎదుర్కొనేందుకు ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అసెంబ్లీకి రాలేని దుస్థితి.
నాడు మూడు పెళ్లిళ్లు, CBN , దత్తపుత్రుడు అంటూ పవన్ ను అవమానించిన వైస్ జగన్ ఇప్పుడు తన సొంత చెల్లి చేతనే మోడీ దత్తపుత్రుడు జగన్ అంటూ విమర్శలు ఎదుర్కుంటున్నారు. అలాగే జగన్ రాజకీయం రాష్ట్రాన్ని మూడుముక్కలు చేసింది అనే ఆరోపణలు మూటకట్టుకున్నారు.
ఇక నాడు RRR పై వైసీపీ చేసిన అరాచకానికి నేడు అదే RRR ముందు ‘అధ్యక్ష’ అంటూ వైసీపీ అనుమతి కోరాల్సిన పరిస్థితి. ఇక బాబు అరెస్టుతో నాడు వైసీపీ, బిఆర్ఎస్ ల స్వకార్యం ముగిసింది అనుకుంటే అదే అరెస్టు ఆ రెండు పార్టీలను అధికారానికి దూరం చేసింది.
ఇలా ఇటు వైసీపీ, అటు బిఆర్ఎస్ రెండు పార్టీలు తమ ప్రత్యర్థి పార్టీలకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేశాం అంటూ తిరిగి అధికారానికి సిద్దమవ్వగా కూటమి రూపంలో వైసీపీ కి, రేవంత్ రూపంలో బిఆర్ఎస్ కు కాలం చాల బలమైన కాటు వేసింది. దీనితో ఏపీలో ప్యాలస్ రాజకీయాలు, తెలంగాణలో ఫామ్ హౌస్ పాలిటిక్స్ కు తెరపడింది.






