ఓటమి సహజమే కానీ గెలుపే ప్రామాణికం!

Analysis of political defeats caused by arrogance and lack of self-reflection

ఓటమి నుంచి పాఠాలు నేర్చుకున్నవారు, విమర్శలతో తప్పులు సరిదిద్దుకున్నవారు, సమస్యలు, సవాళ్ళలో అవకాశాలు వెతుక్కునేవారు రాజకీయాలలో అతికొద్ది మందే ఉంటారు. కానీ దురాలోచనలు, అహంభావంతో నష్టపోయినవారే ఎక్కువ మంది కనిపిస్తుంటారు.

తెలంగాణలో కేసీఆర్‌, కేటీఆర్‌, ఏపీలో జగన్‌ రాజకీయాలలో తమదైన ముద్ర వేశారు. ఎవరూ ఊహించని స్థాయికి ఎదిగారు. కానీ అంత ఎత్తు నుంచి కుప్ప కూలిపోవడంతో వారి ఓటమిని వారే జీర్ణించుకోలేకపోతున్నారు. వారే ఆశ్చర్యపోతున్నారు.

ADVERTISEMENT

అటువంటి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు ఆత్మపరిశీలన చేసుకొని, లోపాలు సరిదిద్దుకొని మళ్ళీ ప్రజలలోకి వెళ్ళి అలుపెరుగని పోరాటాలు చేశారు. వైసీపీ నేతల చేతిలో తీవ్ర అవహేళనకు గురైన నారా లోకేష్‌ కూడా వారు చేసిన ప్రతీ విమర్శ, ఆరోపణ నుంచి తనలో లోపాలను గుర్తించి సరిదిద్దుకున్నారు.

ఈ విషయంలో డెప్యూటీ సిఎం పవన్‌ కళ్యాణ్‌ కాస్త భిన్నమనే చెప్పాలి. జగన్‌తో సహా వైసీపీ నేతలు అయనని ఎంతగా అవమానించినా, అవహేళన చేసినా క్రుంగిపోకుండా, వారు రెచ్చగొట్టి పక్కదారి పట్టించాలనుకున్న దారి తప్పకుండా అన్నిటినీ దైర్యంగా ఎదుర్కొని నిలబడి తాను గెలిచి తన వాళ్ళని గెలిపించుకున్నారు.

రాజకీయాలలో గెలుపోటములు సహజమే. కానీ రాజకీయాలతో సహా ఏ రంగంలోనైనా గెలుపే ప్రామాణికం.

కనుక తెలంగాణలో కాంగ్రెస్‌, ఇక్కడ కూటమి పార్టీల గెలుపుని వాటి ప్రత్యర్ధులు ‘కేస్ స్టడీ’గా తీసుకొని అధ్యయనం చేసి చాలా పాఠాలు నేర్చుకోవచ్చు. కనీసం ఆత్మపరిశీలన చేసుకొని తప్పులు సరిద్దుకోవచ్చు. కానీ కేసీఆర్‌, కేటీఆర్‌, జగన్‌, వైసీపీ నేతలకు అందుకు అహం అడ్డొస్తోంది. అందువల్లే వారు నష్టపోతున్నారు.

పైగా తమ ఓటమిని ఇతరులకు ఆపాదించేసి, ఏమీ జరగనట్లు ముందుకు సాగిపోయే ప్రయత్నంలో ఎదురుదెబ్బలు కూడా తింటున్నారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో బీఆర్ఎస్‌ ఓటమి ఇందుకు తాజా నిదర్శనం.

రాజకీయాలలో అహంభావం ఉన్నవారు రాణించడం చాలా కష్టం. ఇందిరాగాంధీ మొదలు కేసీఆర్‌, కేటీఆర్‌, జగన్‌ వరకు చాలా మంది దానికి మూల్యం చెల్లించినవారే.

అలాగే రాజకీయాలలో అతివిశ్వాసం, అతిశయం కూడా కొంపముంచుతాయి. ఇందుకు సిఎం చంద్రబాబు నాయుడు చక్కటి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఆయన వాటికి లోబడిన ప్రతీసారి ఓడిపోయారు. వాటిని గుర్తించి అధిగమించిన ప్రతీసారి ముఖ్యమంత్రి అవుతూనే ఉన్నారు.

కేసీఆర్‌, కేటీఆర్‌, జగన్మోహన్ రెడ్డి ఈ అవలక్షణాలను వదిలించుకునే బదులు ఆ అవలక్షణాలనే వారు కర్ణుడి కవచ కుండలాలన్నట్లు ధరించి రాజకీయాలు చేస్తున్నారు. అందుకే ఎదురు దెబ్బలు.

చేసే కర్మలని బట్టే ఫలితం ఉంటుంది. విత్తనం ఒకటి వేస్తే మొక్క మరొకటి మొలవదు కదా? కనుక ఆ కర్మలను మార్చుకోగలిగితే ఫలితాలు కూడా మారుతాయి. లేకుంటే అనుభవించక తప్పదు.

ADVERTISEMENT
Latest Stories