మోడీ పక్కన బాబు… కోర్టులో జగన్‌, ఫామ్‌హౌసులో కేసీఆర్‌!

KCR and Jagan facing political setbacks due to wrong strategies

మనం ఎంచుకున్న మార్గం సరైనదైతే గమ్యం చేరుతాము. ఒక్కోసారి సరైన మార్గంలో సాగుతున్నప్పటికీ మద్యలో దారి తప్పడం సహజమే. కానీ వెంటనే గ్రహించి మళ్ళీ సరైన దారిలో ప్రయాణించాలి. లేకుంటే ఎడారి ప్రయాణంగా మారుతుంది. రాజకీయాలతో సహా ఏ రంగానికైనా ఇదే వర్తిస్తుంది.

ఉదాహరణకి నిన్న ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు పాట్నాలో ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులతో కలిసి బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనగా, అదే సమయంలో మాజీ సిఎం జగన్మోహన్ రెడ్డి నాంపల్లి సీబీఐ కోర్టులో ఉన్నారు. కేసీఆర్‌ తన ఫామ్‌హౌసులో ఒంటరిగా ఉన్నారు!

ADVERTISEMENT

గతంలో చంద్రబాబు నాయుడు ప్రధాని మోడీపై కత్తులు దూశారు. కానీ జగన్‌ ఏనాడూ ప్రధాని మోడీతో గొడవ పడలేదు. చాలా విధేయంగానే ఉండేవారు.

జగన్‌ 5 ఏళ్ళపాటు సిఎంగా ఉన్నప్పుడు బీజేపితో పొత్తు పెట్టుకొని ఉండవచ్చు. ఉంటే నేడు ఆయన పరిస్థితి మరోలా ఉండేదేమో? కానీ మైనార్టీ ఓటు బ్యాంక్ లెక్కలు చూసుకొని బీజేపికి దూరంగా ఉండిపోయారు.

తద్వారా ఆయనే స్వయంగా చంద్రబాబు నాయుడుకి బీజేపితో పొత్తు పెట్టుకునే ఆ అవకాశం కల్పించారు. ఆ అవకాశాన్ని ఆయన సద్వినియోగం చేసుకున్నారు. అందువల్లే నేడు అయన ప్రధాని మోడీ పక్కన ఉన్నారు. జగన్‌ సీబీఐ కోర్టులో ఉన్నారు.

కేసీఆర్‌ కూడా ప్రధాని మోడీపై కత్తులు దూశారు. రాజకీయాలలో ఇది సర్వసాధారణ విషయమే. కనుక తప్పనలేము. కానీ కేసీఆర్‌ తన పాపులారిటీని, బలాన్ని, స్థాయిని అతిగా ఊహించుకొని తనకంటే చాలా బలవంతుడితో తల పడ్డారు.

తెలంగాణ ప్రజలు తన వీరత్వం చూసి జేజేలు పలికి మళ్ళీ పట్టం కడతారనుకున్నారు తప్ప తాను (తెలంగాణ) నేల విడిచి సాము చేస్తున్నానని గ్రహించలేకపోయారు. గ్రహించేసరికి చాలా ఆలస్యమైపోయింది.

అందుకు ఆయనతో పాటు కుటుంబ సభ్యులు, పార్టీ కూడా మూల్యం చెల్లించాల్సి వస్తోంది. అధినేతల అహం, అతిశయం వారికీ, వారిని నమ్ముకున్న పార్టీకి నష్టం కలిగిస్తే అర్ధం చేసుకోవచ్చు.

కానీ రాష్ట్రానికి కూడా నష్టం కలిగిస్తే ప్రజలు భరించాల్సిన అవసరం ఉందా? లేదు గనుకనే కేసీఆర్‌, జగన్‌లను దించేశారు.

బిహార్ సిఎం నితీష్ కుమార్‌, ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు ఇద్దరూ తెలివిగా వ్యవహరిస్తూ కేంద్రంతో సఖ్యతగా ఉంటూ తమ తమ రాష్ట్రాలకు ఏమేమి సాధించుకుంటున్నారో అందరూ కళ్ళారా చూస్తూనే ఉన్నారు కదా?

కానీ కేసీఆర్‌, జగన్‌ ఎంచుకున్న విధానాల వలన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకి తీరని నష్టం, అన్యాయం జరిగింది. ‘తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష’ అని కేసీఆర్‌ స్వయంగా చెప్పుకోవడమే ఇందుకు నిదర్శనం కాదా? ఏపీకి రాజధాని బదులు లక్షల కోట్ల అప్పులు మిగిలాయి కదా?

చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌ బీహార్‌లో కూడా కొత్త మిత్రులను సంపాదించుకోగా, కేసీఆర్‌ ఫామ్‌హౌసులో ఒంటరిగా ఉన్నారు. ఎందువల్ల?

కేటీఆర్‌ జూబ్లీహిల్స్‌ సీటునే దక్కించుకోలేక అవమానం పాలయ్యారు. ఎఫ్‌-1 రేసింగ్ కేసులో కదలిక మొదలైనందున బహుశః త్వరలో జైలుకి కూడా వెళ్ళాల్సి రావచ్చు.

అంటే సరైన ఆలోచనలు, విధానాలు ఎంత ముఖ్యమో అర్ధమవుతోంది. వాటి ఫలితాలు, పర్యవసనాలు ఏవిదంగా ఉంటాయో కళ్ళకు కట్టినట్లు కనబడుతున్నాయి కదా?

అంటే దీనర్ధం ప్రధాని మోడీపై కత్తులు దూయడం, బీజేపితో విభేదించడం తప్పనికాదు. కానీ రాజకీయాలలో ఏది మంచి?ఏది ప్రమాదం? ఎక్కడ నెగ్గాలి? ఎక్కడ తగ్గాలి? అనే విజ్ఞత చాలా ముఖ్యం అని చెప్పడానికే ఇదంతా! అది ఉంటే, లేకపోతే ఏమవుతుందో చూపడానికే!

ADVERTISEMENT
Latest Stories