రాజకీయాలలో ఎక్కువ కాలం ‘యాక్టివ్’గా నిలబడగలిగితే, ఏదో రోజు ప్రజలు దయతలిచి ‘ఒక్క ఛాన్స్’ ఇస్తుంటారు. అలా లక్కీ లాటరీ తగిలే అవకాశం ఉంటుంది. పాదయత్రల్లాగే ఇదీ వియవంతంగా నిరూపించబడిన ఓ రాజకీయ ఫార్ములా. అందుకే కొంత మంది నాయకులు ఎన్ని కేసులు, ఒత్తిళ్ళు, ఎదురుదెబ్బలు తగులుతున్నా తగ్గేదేలే అంటున్నారనుకోవచ్చు.
అలాగని ఎక్కువ కాలం రాజకీయాలలో నిలబడగలిగిన వాళ్ళందరూ ముఖ్యమంత్రులు, మంత్రులు కాలేకపోవచ్చు. కాస్త అదృష్టం కూడా కలిసి రావాలి. అలా అదృష్టం కలిసి వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్కువ కాలం ఆ స్థానంలో ఉండటం ఇంకా కష్టం.
ఉండగలమని, ఉంటామనే గట్టి నమ్మకంతోనే ఉంటారు. కానీ వంద గొడ్లు తిన్న రాబందు కూడా ఒక్క గాలివానకి చచ్చిందన్నట్లు, అలా ఉండగలమనుకున్నవారు కూడా ఫామ్‌హౌసులో పడుతుంటారు.
మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి భారీ మార్పులు వస్తాయని తెలిసి ఉన్నాఎవరూ ఒప్పుకోవడానికి ఇష్టపడరు.
అధికారం కలర్ పిక్చర్ వంటిదైతే, ఒకసారి అధికారం అనుభవించి ప్రతిపక్షంలో కూర్చోవాల్సి రావడం బ్లాక్ అండ్ వైట్ పిక్చర్ వంటిదని చెప్పవచ్చు. కనుక ‘కలర్ పిక్చర్’లో ఉన్నవారు ఏం చేసినా చెల్లుతుంది. ఏం మాట్లాడినా చప్పట్లు పడతుంటాయి. కనుక ‘నేనే రాజు నేనే మంత్రిని, నా మాటే శాసనం’ అని చెప్పుకొని చప్పట్లు కొట్టించుకోవడం సర్వసాధారణం.
కానీ జీవితం మళ్ళీ ‘బ్లాక్ అండ్ వైట్’లోకి మారిపోయినప్పుడు కూడా ‘నా మాటే శాసనం… అన్న బయటకు వస్తే మాస్… అన్న శాసనసభకు వస్తే మాస్… అన్న రాకపోయినా మాస్’ అంటూ భజన బృందాలతో పాటలు పాడించుకొని ఆనందిస్తుండటమే ఆశ్చర్యం కలిగిస్తుంది.
బళ్ళు నది దాటాల్సి వస్తే ఓడలు ఎక్కాల్సిందే. కాదని నదిలో దిగితే ఎంత పెద్ద బండయినా మునిగిపోక తప్పదు. అలాగే ఓడలు నది వరకు చేరుకోవాలంటే బళ్ళ మీదనే వెళ్ళాలి. కాదని రోడ్డు సాగలేవు. అందుకే ఓడలు, బళ్ళు అంటారు.
ఇలాంటి రెండు పరిస్థితులలో రాజకీయ పార్టీ అధినేతలు ఏవిధంగా వ్యవహరించాలో టీడీపి దాని అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన దాని అధినేత పవన్ కళ్యాణ్ చక్కగా ఆచరణలో చూపారు.
కనుక వారి పార్టీల తీరుని ‘కేస్ స్టడీ’గా తీసుకొని పనిచేస్తే ఎవరికైనా మళ్ళీ రెండో ఛాన్స్ లేదా ఎప్పటికైనా లక్కీ ఛాన్స్ తగిలే అవకాశం ఉంటుంది. కానీ శత్రువుల నుంచి నేర్చుకోవాలంటే ఇగో అడ్డొస్తుంటుంది.




