
హైదరాబాద్‌లో ఆక్రమణలను తొలగించి ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ‘హైడ్రా’ అనే ప్రత్యేక వ్యవస్థని ఏర్పాటు చేయగా అది నెల రోజుల్లోనే సుమారు 160కి పైగా అక్రమ కట్టడాలను కూల్చివేసింది. తెలంగాణ రాజకీయాలలో హైడ్రా ప్రకంపనలు సృష్టిస్తోంది.
Also Read – తెలుగు వాడి ఆత్మ గౌరవం…తెలంగాణ నినాదం…!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా అటువంటి హైడ్రా అవసరం ఉందని మంత్రి నారాయణ అన్నారు. మంగళవారం విశాఖ నగర శివారులో కాపులుప్పాడ వద్ద ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డులో చెత్త నుంచి విద్యుత్ తయారీ కేంద్రాన్ని పరిశీలించిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ, “గత 5 ఏళ్ళలో రాష్ట్ర వ్యాప్తంగా భారీగా భూకబ్జాలు జరిగాయి.
ముఖ్యంగా రాజధాని పేరుతో విశాఖలో భారీగా భూకబ్జాలు జరిగాయి. కనుక కబ్జాదారులు స్వచ్ఛందంగా తమ భవనాలను కూల్చివేసి తొలగించుకుంటే మంచిది. లేకుంటే ప్రభుత్వమే వాటిని కూల్పించేస్తుంది. అవసరమైతే హైడ్రా వంటి వ్యవస్థని ఏర్పాటు చేస్తాము,” అని మంత్రి నారాయణ హెచ్చరించారు.
Also Read – ఉల్ఫా బ్యాచ్ అట… జగన్ హర్ట్ అవరూ?
తెలంగాణ రాష్ట్రం, ముఖ్యంగా హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతుండటంతో భూముల ధరలు ఎకరా రూ.60-100 కోట్లు వరకు చేరుకున్నాయి. కనుక పలువురు రాజకీయ నేతలు చెరువులను, కాలువలను, ప్రభుత్వ భూములను కబ్జా చేసి దర్జాగా ఫామ్‌హౌస్‌లు, కాలేజీలు నిర్మించేసుకున్నారు. వాటినే హైడ్రా ఇప్పుడు కూల్చివేస్తోంది.
తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ గత 5 ఏళ్ళలో అన్ని రంగాలలో వెనుకబడిపోయినప్పటికీ, భూములు ఎప్పటికీ చాలా విలువైనవే కనుక ఎక్కడికక్కడ వైసీపి నేతలు ఆక్రమణలకు పాల్పడ్డారు. ఇప్పటికే ప్రభుత్వం వాటిపై విచారణ జరిపిస్తోంది.
Also Read – వైసీపీ నేతల రిమాండ్ కష్టాలు…
ఉండవల్లిలో అనుమతులు లేకుండా నిర్మించిన వైసీపి కార్యాలయాన్ని కూల్చేసింది కూడా. అనుమతులు, సరైన పత్రాలు లేకుండా రాష్ట్రంలో నిర్మించిన వైసీపి కార్యాలయాలకు కూడా నోటీసులు జారీ చేసింది. అయితే వైసీపి నేతల అక్రమ కట్టడాలను ప్రభుత్వం కూల్చివేయిస్తే రాజకీయ కక్ష సాధింపు అంటూ వైసీపి దుష్ప్రచారం చేయకుండా ఉండదు.
స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన హైడ్రాతో అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నప్పటికీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్ష సాధింపులకి పాల్పడుతోందని ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. కోర్టులో కేసులు పడుతూనే ఉన్నాయి.
అయితే కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయంగా వాటిని ఎదుర్కొంటుంటే, హైడ్రా కోర్టు కేసులను ఎదుర్కొటోంది. కనుక కూల్చివేతలను రాజకీయాల నుంచి, ముఖ్యంగా ప్రభుత్వం నుంచి వేరు చేయగలిగారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఆక్రమణలు తొలగించడానికి అటువంటి హైడ్రా ఏర్పాటు చేసుకోసుకోగలిగితే మంచిదే.