ఈ భూ ప్రపంచంలో కేవలం మనుషులు మాత్రమే మాట్లాడగలరు. అదీ… ఒకటీ రెండూ కాదు, కొన్ని వందల భాషలున్నాయి. ఎవరి భాషలో వారు మాట్లాడుకుంటారు. అయితే మొబైల్ ఫోన్, ఇంటర్నెట్, సోషల్ మీడియాల వల్ల మాటలు కూడా మంచి కంటే చెడుకే ఎక్కువ వినియోగిస్తున్నారు.
మనిషికి రెండు చెవులు, రెండు కళ్ళు ఇచ్చిన దేవుడు నాలిక ఒక్కటే ఇచ్చాడు. దేనికంటే ఎక్కువ విని, ఎక్కువ చూసి, తక్కువ మాట్లాడమని. కానీ మనుషులు నాలుకనే అవసరానికి మించి చాలా ఎక్కువగా వాడేస్తుంటారు. అది అనవసరమైన ఆహారం తినడం కోసం కావచ్చు లేదా అనవసరమైన మాటలు మాట్లాడటం కోసం కావచ్చు. రెండూ మంచి అలవాట్లు కావు.
అతిగా మాట్లాడటం, అనాలోచితంగా మాట్లాడటం, ఆవేశపడటం, కోపంతో ఇతరులపై విరుచుకు పడటం వంటి లక్షణాలలో ఒకటో రెండో ప్రతి ఒక్కరిలో ఉంటాయి.
అలాగే ఎదుటివారు చెప్పేది వినకుండా సొంత డబ్బా కొట్టుకోవడం లేదా ఎదురుగా లేని బంధుమిత్రులు, సహచరుల గురించి ఇతరులతో చులకనగా మాట్లాడటం వంటివి చాలా మంది చేస్తుంటారు.
వీటిలో ఏ ఒక్క అలవాటు ఉన్నా అది అవలక్షణమే. అదే సమాజం దృష్టిలో మన స్థాయిని తగ్గిస్తుంది. ఇతరులు కూడా మన గురించి ఇలాగే మాట్లాడుకునేలా చేస్తుంది. కనుక మనిషి వ్యక్తిత్వంలో మాట ప్రభావం చాలా ఎక్కువ. ఆ తర్వాతే మిగిలినవన్నీ.
ఒకవేళ శరీరం బరువు పెరిగితే తగ్గించుకోవడానికి చాలా శ్రమ పడాల్సి ఉంటుంది. మద్యం లేదా మరేదైనా దురలవాటుకు లోనైతే వదిలించుకోవడానికి కూడా చాలా శ్రమ పడాల్సి ఉంటుంది.
కానీ కాస్త సాధనతో మాటను అదుపు చేయడం నేర్చుకోవచ్చు. కనుక 2026లో పెద్ద టార్గెట్లు పెట్టుకున్నప్పటికీ ముందుగా మాటపై నియంత్రణ సాధించేందుకు ప్రయత్నిస్తే మంచిది.







