కురుక్షేత్ర యుద్ధం గురించి రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. 1. ధర్మం కోసం జరిగిన ఆ యుద్ధం పాండవులు గెలిచారు. శ్రీకృష్ణుడు దుష్ట సంహారం జరిపించాడు. 2. ఆ యుద్ధంలో బంధుమిత్రులను కోల్పోయినందుకు పాండవులు, చనిపోయిన లక్షలమంది సైనికుల కోసం వారి కుటుంబాలు ఎంతగానో కుమిలిపోయారు.
ఆ విజయాన్ని ఎవరూ ఆస్వాదించ లేకపోయారు. చివరికి పాండవులు, శ్రీకృష్ణుడుతో సహా ఇహలోకాన్ని వీడారు. యుద్ధంలో ఓడినవారికి ఎలాగూ విషాదం తప్పదు. గెలిచినవారికి కూడా విషాదం తప్పలేదు. ఇదంతా ఇప్పుడు ఎందుకంటే, పులివెందులలో కూడా ఇదే జరుగబోతోందని చెప్పడానికే!
రూరల్ జెడ్పీటీసీ ఉప ఎన్నికను శాసనసభ, లోక్ సభ ఎన్నికలంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని టీడీపి, వైసీపీలు పోరాడుతున్నాయి. కనుక ఎవరు గెలిచినా, ఓడినా విజయానందం కంటే బాధే ఎక్కువ ఉండవచ్చు.
ఉదాహరణకు టీడీపి గెలిస్తే, కూటమి ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అనేక అక్రమాలు, దౌర్జన్యాలు చేసి గెలిచిందని వైసీపీ ఆరోపించాకుండా ఉండదు. ఓటర్ల నమోదు మొదలు పోలింగ్ వరకు మొత్తం ప్రక్రియని తారుమారు చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని ఆరోపించకుండా ఉండదు.
తన ఓటమిని కప్పి పుచ్చుకోవాలనుకుంటే గవర్నర్, కేంద్ర ఎన్నికల కమీషన్, రాష్ట్రపతిని కలిసి పిర్యాదులు చేసినా ఆశ్చర్యం లేదు. కనుక టీడీపికి ఈ గెలుపు గొప్ప గెలుపు కాకపోవచ్చు. కానీ జగన్ కంచు కోటలో అడుగుపెట్టామనే తృప్తి ఒకటే మిగులుతుంది.
ఒకవేళ వైసీపీ గెలిస్తే, కూటమి ప్రభుత్వం ఎంత బరి తెగించినప్పటికీ చివరికి న్యాయం, ధర్మం, ప్రజాస్వామ్యమే గెలిచాయని గొప్పగా చెప్పుకోగలదు. పులివెందుల ప్రజలు టీడీపి బెదిరింపులకు, ప్రలోభాలకు తలొగ్గకుండా తమకు ఎంతో మేలు చేసిన జగన్‌కి అండగా నిలబడ్డారని చెప్పుకోగలదు.
వచ్చే సార్వత్రిక ఎన్నికలలో కూడా బ్యాలెట్ పేపర్లతో పోలింగ్ నిర్వహిస్తే, అధికార పార్టీ అక్రమాలకు అడ్డు కట్ట వేయవచ్చని, వైసీపీ తప్పకుండా గెలుస్తుందని మరింత గట్టిగా వాదించవచ్చు.
ఈ ఎన్నికలో టీడీపి, వైసీపీలు నేర్చుకునే గుణపాఠం ఏమిటంటే, జెడ్పీటీసీ వంటి ఎన్నికని లోక్ సభ, శాసనసభ ఎన్నికలన్నట్లు ప్రతిష్టాత్మకంగా తీసుకోకూడదు. తీసుకుంటే సర్వశక్తులు ఒడ్డి పోరాడినా ఇటువంటి చేదు అనుభవాలు ఎదుర్కోక తప్పదు. ఇటువంటి ఎన్నికలో గెలిచినా పెద్దగా ఒరిగేదేమీ ఉండకపోవచ్చు కానీ ఓడితే అప్రదిష్ట తప్పదు. గెలిచినవారు ఇంట్లో కూర్చొని ఏడిస్తుంటే, ఓడినవారు బయట కూర్చొని ఏడవక తప్పదు.






