పులివెందుల జెడ్పీటీసీ వేదికగా వైసీపీ-టీడీపిల మద్య భీకర యుద్ధం జరుగుతుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. నిన్న పోలింగ్ సందర్భంగా జరిగిన అల్లర్ల కారణంగా 3,14 పోలింగ్ కేంద్రాలలో నేడు రీపోలింగ్ నిర్వహిస్తున్నారు. టీడీపి శ్రేణులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నందున నేడు రెండు కేంద్రాలలో జరుగుతున్న రీ పోలింగ్‌ని బహిష్కరిస్తున్నామని వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ప్రకటించారు.
మరోపక్క జగన్ తాడేపల్లి ప్యాలస్ మీడియా సమావేశం పెట్టి, పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలలో సిఎం చంద్రబాబు నాయుడు అధికార దుర్వినియోగానికి పాల్పడి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆరోపించారు. టీడీపి శ్రేణులు పోలింగ్ కేంద్రాలలో దౌర్జన్యాలు చేస్తుంటే పోలీస్ ఉన్నతాధికారులు పట్టన్నట్లు చూస్తూ ఉండిపోయారని ఆరోపించారు.
ఏపీ పోలీసుల ఆధ్వర్యంలో ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగవని తేలిపోయింది కనుక కేంద్ర బలగాల సమక్షంలో మళ్ళీ అన్ని కేంద్రాలలో రీపోలింగ్ నిర్వహించాలని జగన్ అన్నారు.
రాజ్యాంగ వ్యవస్థలపై మాకు నమ్మకం ఉంది కనుక ఈ ఎన్నికలలో జరిగిన అక్రమాలు, అవకతవకలను కేంద్ర ఎన్నికల కమీషన్, సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్ళి న్యాయపోరాటం చేస్తామని జగన్ అన్నారు.
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన ప్రతీ ఎన్నికలలో ఎన్ని అక్రమాలకు పాల్పడ్డారో మరిచినట్లు ఇప్పుడు ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని గౌరవించాలంటూ నీతులు చెపుతున్నారు.
ఎన్నికల ప్రక్రియలో అవకతవకలను తప్పకుండా ఖండించాల్సిందే. కానీ ఇటీవల జగన్ చెప్పినట్లుగా మనం ఏ విత్తనం వేస్తే అదే మొక్క మొలుస్తుంది తప్ప వేరే మొక్క మొలవదు కదా?కనుక ఇది కూడా స్వయంకృతమే అని జగన్ గ్రహిస్తే మంచిది.
అసలు చంద్రబాబు నాయుడు లేదా టీడీపి పులివెందుల జెడ్పీటీసీ వంటి చిన్న ఎన్నికని ఎందుకు ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని జగన్ ఒక్కసారి ఆలోచిస్తే సమాధానం ఆయనకే తెలుస్తుంది.
జగన్ అక్రమాస్తుల కేసులలో చట్టంలోని లొసుగులను ఉపయోగించుకుంటూ 15 ఏళ్లుగా న్యాయ వ్యవస్థతో ఆటలాడుకుంటున్నారు. వివేకా హత్య కేసులో సీబీఐ, న్యాయవ్యవస్థలని ముప్పతిప్పలు పెడుతున్నారు.
కానీ పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలలో తనకు అన్యాయం జరిగితే తనకు న్యాయం చేయాల్సిన బాధ్యత న్యాయ వ్యవస్థదే అన్నట్లు జగన్ మాట్లాడుతున్నారు. అందితే జుట్టు లేకుంటే కాళ్ళు పట్టుకున్నట్లు జగన్ మాట్లాడుతున్నారు. ఆయన మాటలకు, చేతలకు పొంతన ఉండదని గ్రహించేందుకు ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఏముంటుంది?






