మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను ప్రతిపక్ష రాజకీయ నాయకులే కాకుండా సినీ ప్రముఖులు కూడా ఖండిస్తున్నారు. తప్పు పడుతున్నారు. ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్రరావు స్పందిస్తూ, “ ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం అపహాస్యం అయ్యింది. ఒక విజనరీ లీడర్ అయినటువంటి నారా చంద్రబాబు నాయుడుగారిని అరెస్ట్ చేసిన విధానం అప్రజాస్వామికం. ఏపీలో ఉన్నఅంబేద్కర్ విగ్రహాలన్నీ కూడా తాను రాసిన రాజ్యాంగం చచ్చిపోతున్నందుకు బాధ పడుతున్నాయి.” అని ట్వీట్ చేశారు.
మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నెల్లూరులో విలేఖరులతో మాట్లాడుతూ, “మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని జగన్ అరెస్ట్ చేయడాన్ని నేను ఖండిస్తున్నాను. జగన్ చాలా కుత్సితంగా ఆలోచించి ఈ పనికి పూనుకొన్నారని నేను భావిస్తున్నాను. తాను 16 నెలలు జైల్లో ఉండి వచ్చారు కనుక చంద్రబాబు నాయుడుని కూడా జైలుకి పంపి ఎన్నికలలో అదేచెప్పుకోవాలని భావిస్తున్నట్లున్నారు. 40 ఏళ్ళగా రాజకీయాలలో ఉన్న చంద్రబాబు నాయుడుపై ఒక్క అవినీతి మచ్చపడలేదు. ఇది కూడా జగన్ సహించలేకపోతున్నారు. అందుకే ఈ అక్రమకేసు బనాయించి ఆయనకు కూడా అవినీతి మరక అంటించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి జగన్ తన గొయ్యి తానే తవ్వుకొన్నారు. ఆయనపై ఈ రాజకీయ కక్ష సాధింపుని చూసి రాష్ట్ర ప్రజలందరూ అసహ్యించుకొంటున్నారు. ఎన్నికలలో జగన్‌కు బుద్ది చెప్పబోతున్నారు,” అని అన్నారు.



