వైసీపీ ఎంపీ రఘురామకృష్ణ రాజుని పార్లమెంటు కార్యక్రమాలను ప్రసారం చేసే సంసద్ టీవీ న్యూస్ ఛానల్‌లో జరిగే చర్చా కార్యక్రమాలలో అనుమతించవద్దని కోరుతూ ఆ పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయి రెడ్డి సంసద్ టీవీ సీఈవోకు ఓ లేఖ వ్రాశారు.
రఘురామకృష్ణ రాజు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ పార్టీ క్రమశిక్షణ ఉల్లంగిస్తున్నందున ఆయనపై అనర్హత వేటు వేయవలసిందిగా తాము లోక్‌సభ స్పీకరుకి పిటిషన్ ఇచ్చామని లేఖ ద్వారా తెలియజేశారు. కనుక ఆయనకు, ఆయన వ్యక్తం చేసే అభిప్రాయాలకు పార్టీతో కానీ, జగన్ ప్రభుత్వంతోగానీ ఎటువంటి సంబందమూ లేదని తెలిపారు. పార్టీతో సంబందం లేని వ్యక్తి పార్టీ గురించి బహిరంగ చర్చావేదికలలో మాట్లాడటం సరికాదని విజయసాయి రెడ్డి లేఖలో పేర్కొన్నారు.
దీనిపై రఘురామకృష్ణ రాజు స్పందిస్తూ, “నేటికీ నేను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను. కనుక నన్ను చర్చా వేదికలలో అనుమతించవద్దని కోరే అధికారం ఎవరికీ లేదు. ఒకవేళ నాకు వైసీపీతో సంబందం లేదని వారు భావిస్తున్నట్లయితే తక్షణం నన్ను పార్టీ నుంచి బహిష్కరించవచ్చు కదా?దమ్ముంటే నన్ను పార్టీ నుంచి బహిష్కరించాలని నేను విజయసాయి రెడ్డిని, మా పార్టీ అధినేత, ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డిని సవాలు చేస్తున్నాను,” అని అన్నారు.
రఘురామకృష్ణ రాజు ప్రధానంగా జగన్ వైఖరి పట్ల అసహనంతోనే పార్టీకి దూరమయ్యారు. అప్పటి నుంచి పార్టీపై, జగన్ ప్రభుత్వంపై తరచూ విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. జగన్ ప్రభుత్వ నిర్ణయాలను సవాలు చేస్తూ హైకోర్టు, సుప్రీంకోర్టులో కేసులు వేస్తున్నారు కూడా. అయినా జగన్మోహన్ రెడ్డి ఆయనను పార్టీ నుంచి బహిష్కరించడానికి వెనకాడుతున్నారు. బహుశః ఆయనను పార్టీ నుంచి బహిష్కరించినట్లయితే టిడిపి లేదా బిజెపిలో చేరిపోయేందు మార్గం సుగమం చేసినట్లవుతుందనే ఆలోచనతో వెనకాడుతున్నట్లున్నారు.
అయితే వైసీపీకి, జగన్ ప్రభుత్వానికి పక్కలో బల్లెంలా మారిన ఆయనను పార్టీలో ఉంచుకోవడం వలన ఆయన చేసే తీవ్ర విమర్శలు, ఆరోపణలు, వేస్తున్న కోర్టు కేసులతోనే వైసీపీకి, జగన్ ప్రభుత్వానికి ఎక్కువ నష్టం జరుగుతుండటం అందరూ చూస్తూనే ఉన్నారు.



