వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు రోజూ నిర్వహించే “రచ్చబండ” కార్యక్రమంలో నేడు సరికొత్త విషయాన్ని ప్రస్తావించారు. ఇటీవల జగన్ తిరుమల వెళ్లిన సందర్భాన్ని ఉదహరిస్తూ… జగన్ సతీమణి భారతి రెడ్డి గారిని ప్రశంసించారు. ఓ రకంగా చెప్పాలంటే… గోదావరి జిల్లాలలోని వెటకారాన్ని వెలికితీశారు.
పాపం… భారతిరెడ్డి గారికి జగన్ కు వచ్చినంత నటన రాదు. అందుకే ఆమె ఎప్పుడూ తిరుమలను దర్శించరు. తాను చాలా సందర్భాలలో చెప్పానని… స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించేటపుడు సతీసమేతంగా విచ్చేయాలని, కానీ ఎప్పుడూ ఈయన ఒక్కరే వస్తారని, వచ్చి తన వింత వింత చేష్టలను చేస్తారని అన్నారు.
భారతిరెడ్డి గారు ఆమె నమ్ముకున్న దేవుడిని మాత్రమే కొలుస్తారని, అందుకే తిరుమల ఎప్పుడూ విచ్చేయరని, ఓ విధంగా అది మంచి విషయమే, ఈ సందర్భంగా ఆమెను తాను మెచ్చుకుంటున్నానని అన్నారు ఆర్ఆర్ఆర్. అలాగే ఈయన గారు ప్రసాదం తింటారో లేదో తెలియదని, నోటి దాకా వెళ్తుంది గానీ, అది లోపలకి వెళ్తుందో లేదో తెలియదని, ఈయన మాదిరి ఆమె నటించడం రాలేకపోవడం వలనే తిరుమల రావట్లేదేమోనని అన్నారు.
సహజంగా ప్రత్యర్థి రాజకీయ నాయకుల మహిళలను టార్గెట్ చేయడం వైసీపీ నేతలు మరియు ఆ పార్టీ సిద్ధాంతంగా మారింది. కానీ ప్రస్తుతం తమ పార్టీ ఎంపీ అయిన ఆర్ఆర్ఆర్, ఏకంగా సీఎం సతీమణి గారి గురించి ప్రస్తావించడం విశేషం. దీనిపై వైసీపీ నేతలు ఏ విధంగా ప్రతిస్పందిస్తారో చూడాలి. సహజంగా వైసీపీ నేతలు ఎదురుదాడి బూతులు మినహా మరే విధంగా సంభాషించరన్న విషయం అందరికి తెలిసిందే. ఈ సారి ఏ విధమైన భాషను వినియోగిస్తారో వేచిచూడాలి.
ఇదిలా ఉంచితే ఏపీ రాజకీయాలను ఉద్దేశించి కూడా ఆర్ఆర్ఆర్ ఈ సందర్భంగా మరికొన్ని ముఖ్య విషయాలను ప్రస్తావించారు. చంద్రబాబు అరెస్ట్ కు తోడు ప్రస్తుతం చర్చలలో ఉన్న నారా లోకేష్ మరియు రామోజీరావుల అరెస్ట్ లు కూడా జరిగితే ఇప్పటివరకు పులివెందులలో గెలుస్తామా? లేదా? అన్నది ఒక ‘డౌట్’ మాత్రమేనని, అది జరిగితే పులివెందుల కూడా ‘అవుట్’ అని ఎద్దేవా చేసారు.



