ముందు పార్టీ జోడో బేటా… తర్వాత భారత్‌ జోడ్డిద్దుగాని!

Rahul Gandhi Bharat Jodo Yatraరాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి, ఆ పదవి చేపట్టడానికి నిరాకరిస్తున్నప్పటికీ, పార్టీకి తానే అధ్యక్షుడినన్నట్లు వ్యవహరిస్తుంటే, పార్టీలో నేతలు కూడా ఆయనే తమ అనధికార అధ్యక్షుడని భావిస్తుంటారు. కనుకనే ఆయన నేటి నుంచి భారత్‌ జోడో (భారత్‌ని కలుపుదాం) అంటూ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 3,570 కిమీ పాదయాత్ర ప్రారంభించగా, 119 మంది సీనియర్ కాంగ్రెస్‌ నేతలు ఆయన వెంట నడుస్తున్నారు.

ఐదు నెలలపాటు సాగే ఈ భారత్‌ జోడో పాదయాత్రలో 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గుండా వారు రాహుల్ గాంధీతో కలిసి పాదయాత్ర చేస్తారు. దారి పొడవునా సభలు, స్థానిక నేతలు, మిత్రపక్షాలతో సమావేశాలు నిర్వహిస్తూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తూ ముందుకు సాగుతారు.

ADVERTISEMENT

2014,2019 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ వరుస పరాజయాలు పాలైనప్పుడు రాహుల్ గాంధీ అస్త్ర సన్యాసం చేశారు. పార్టీలో సీనియర్లు తన నాయకత్వ లక్షణాలను పదేపదే ప్రశ్నిస్తుండటం, పార్టీని సమూలంగా ప్రక్షాళన చేయడానికి వారు అడుగడుగునా అడ్డుపడుతుండటం, వారి ఒత్తిళ్ళకు తలొగ్గి సోనియా గాంధీ కూడా వారికే వంతపాడుతుండటం వలననే ఆయన పార్టీ పగ్గాలు చేపట్టేందుకు నిరాకరిస్తున్నట్లు కాంగ్రెస్‌ వర్గాలు చెపుతున్నాయి.

అయితే రాహుల్ గాంధీకి బలమైన నాయకత్వ లక్షణాలు ఉండి ఉంటే ఇటువంటి అంతర్గత సమస్యలను ఏనాడో పరిష్కరించుకొని, పార్టీని తనదైన శైలిలో ముందుకు నడిపించేవారు. కానీ ఆయన అస్త్ర సన్యాసం చేయడం ద్వారా తన అసమర్దతను తానే దృవీకరించుకొన్నట్లయింది!

అదే… 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు గుజరాత్‌ సిఎంగా ఉన్న నరేంద్ర మోడీని బిజెపి ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించినప్పుడు ఆయనకు సొంత పార్టీలోను, దేశప్రజలలోను తీవ్ర వ్యతిరేకత ఉండేది. దానిని ఆయన ధైర్యంగా ఎదుర్కొని పోరాడి ప్రధాని అయిన సంగతి బహుశః అందరికీ గుర్తుండే ఉంటుంది. రాహుల్ గాంధీలో అటువంటి నాయకత్వ లక్షణాలు, పోరాట పటిమ లోపించినందునే నేడు కాంగ్రెస్‌ ఈ దుస్థితిలో ఉందని చెప్పక తప్పదు.

కనుక తన వలన నిర్వీర్యమైన కాంగ్రెస్ పార్టీని మళ్ళీ పునరుత్తేజపరచాలనో లేక కాంగ్రెస్‌లోని రాజకీయాల నుంచి దూరంగా పారిపోయేందుకే రాహుల్ గాంధీ ఈ జోడో కార్యక్రమం పెట్టుకొన్నారో తెలీదు. కానీ రాహుల్ గాంధీకి నాయకత్వ లక్షణాలు లేవని తేలిపోయినప్పుడు ఆయన కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 3,570 కిమీ కాళ్ళు అరిగేలా పాదయాత్ర చేసినా ఏమీ ప్రయోజనం ఉండకపోవచ్చు.

కాంగ్రెస్ పార్టీని కాపాడుకొనేందుకు రాహుల్ గాంధీ తన వంతు ప్రయత్నాలు చేస్తూనే తక్షణం పార్టీలో బలమైన నాయకుడు పార్టీ పగ్గాలు చేపట్టేందుకు చొరవ తీసుకొంటే ఏమైనా ప్రయోజనం ఉంటుంది. లేకుంటే ఆయన పాదయాత్ర ముగిసేసరికి కాంగ్రెస్ కోట పూర్తిగా బీటలువారి కుప్పకూలిపోయే ప్రమాదం ఉంటుంది.

ADVERTISEMENT
Latest Stories