అవును. ఇంతకాలం రాజకీయా పార్టీలు రిగ్గింగ్ చేస్తుండేవని వార్తలు వినిపించేవి. కానీ ఇప్పుడు ఎన్నికల సంఘమే ఓట్లు దొంగతనం చేస్తోంది! ఈ సంచలన ఆరోపణ చేసింది కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ.
నేడు ఢిల్లీలో ఇందిరా భవన్‌లో ప్రెస్‌మీట్ పెట్టి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ఎన్నికల సంఘం ఏవిదంగా ఓట్లు దొంగతం చేస్తోందో వివరించారు.
కానీ ఎన్నికల సంఘానికి ఓట్లు దొంగతనం చేయాల్సిన అవసరం ఏమిటి? అంటే మోడీ, బీజేపిల కోసమేనని చెప్పారు. వారి ఒత్తిళ్ళకు తలొగ్గి ఈసీ వివిధ రాష్ట్రాలలో ఓట్లు దొంగతనం, దొంగ ఓట్లు నమోదు, కాంగ్రెస్ మిత్ర పక్షాలకు అనుకూలంగా ఉండేవారి ఓట్లు తొలగించడం వంటివి చేస్తోందని వివరించారు.
ఒకే ఇంట్లో 80 ఓటర్లు, సింగిల్ బెడ్ రూమ్ ఇంట్లో 40 మంది ఓటర్లు, అడ్రస్, ఫోటోలు లేని ఓటర్ కార్డులు, ఒకే పేరు, చిరునామాతో వివిధ రాష్ట్రాలలో ఓటు హక్కు కలిగిన ఓటరు కార్డులు… ఇలా రకరకాలుగా మోసం చేస్తోందని రాహుల్ గాంధీ ఆరోపించారు.
కర్ణాటక శాసనసభ ఎన్నికలలో బెంగలూరులోని మహాదేవ్‌పూర్‌లో ఒకే చిరునామాతో ఏకంగా 10,000 ఓట్లు నమోదు అయ్యాయని రాహుల్ గాంధీ ఆరోపించారు.
మహారాష్ట్ర , కర్ణాటక ఎన్నికలలో జరిగిన ఈ మోసాలపై తమ పార్టీ లోతుగా అధ్యయనం చేయించి బలమైన సాక్ష్యాధారాలు సేకరించిందని రాహుల్ గాంధీ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకుండా అడ్డుకునేందుకు మోడీ ప్రభుత్వం ఈసీని ఉపయోగించుకుంటోందని రాహుల్ గాంధీ ఆరోపించారు.
త్వరలో బిహార్ శాసనసభ ఎన్నికలు జరుగబోతున్నాయి. కనుక ఆ రాష్ట్రంలో కూడా ఈసీ ఈవిదంగానే ఓటర్ల జాబితాలు తారుమారు చేస్తోందని, ఇప్పటికే బోగస్ ఓట్ల ఏరివేత పేరుతో లక్షల మంది ఓటర్లని జాబితాల నుంచి తొలగించిందని ఆరోపించారు. ఈ కారణంగానే ప్రజాభిప్రాయానికి అద్దం పట్టే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా తప్పుతున్నాయని రాహుల్ గాంధీ ఆరోపించారు.
రాహుల్ చేస్తున్న ఈ ఆరోపణలు చాలా తీవ్రమైనవే. ప్రజళ ఓట్లు, వారి అభిప్రాయంతో సంబంధం లేకుండా రాజకీయ పార్టీలు ఎన్నికలలో గెలిచి, అధికారంలోకి రాగలిగితే ఇక ఎన్నికలు నిర్వహించడం కూడా అవసరం లేదు.
రాహుల్ గాంధీ బలమైన సాక్ష్యాధారాలు ఉన్నాయంటున్నారు. కనుక సుప్రీంకోర్టులో కేసు వేస్తే మంచిది. ఈవిదంగా ఎంత అక్రోశించినా ప్రయోజనం ఉండదు.






