ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారంలో భాగంగా రాయ్‌బరేలీలో నిర్వహించిన ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తన సోదరి ప్రియాంక గాంధీతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాని నరేంద్ర మోడీపై మండిపడ్డారు. మోడీని ‘షోలే’ సినిమాలో గబ్బర్ సింగ్‌తో పోలుస్తూ… రెండేళ్ల తర్వాత ఉత్తరప్రదేశ్‌లోకి ‘గబ్బర్ సింగ్’ వచ్చారని, ఆయన బెనారస్ వెళ్లి తాను గంగాపుత్రుడిని అని చెప్పుకున్నారని, ఇప్పుడు వారణాసి వచ్చి దత్తపుత్రుడినని అంటున్నారని ఎటకారపు వ్యాఖ్యలు చేసారు రాహుల్ గాంధీ.
మోడీ అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా ఇప్పటికీ అచ్చేదిన్ రాలేదని, రైతులకు రుణాలు మాఫీ కూడా చేయడం లేదని, మరోవైపు వ్యాపారవేత్త విజయ్ మల్యా లాంటి వారు 9 వేల కోట్లతో దేశం విడిచి జారుకునేలా చేశారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పెద్ద నోట్లను రద్దు చేస్తూ మోడీ తీసుకున్న నిర్ణయంతో కేవలం పేదవాడు మాత్రమే బ్యాంకులు, ఏటీఎంల ముందు క్యూలో నిల్చున్నారని, ఒక్క ధనికుడికైనా కష్టాలు వచ్చాయా? అని మండిపడ్డారు. హామీలు ఇవ్వడమే తప్పా చేసేది ఏమీ ఉండదని మోడీపై ఓ స్థాయిలో విరుచుకుపడ్డారు.



