ఏపీలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోందని వైసీపీ నేతలు ఆరోపిస్తుంటే, దేశవ్యాప్తంగా నకిలీ, దొంగ ఓట్లతో కేంద్ర ప్రభుత్వం ఎన్నికలలో దొడ్డిదారిన అధికారం చేజిక్కించుకుంటోందని రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు.
కానీ ఇటువంటి పరిస్థితులనే ఎదుర్కొంటూ ఎన్నికలలో గెలవాల్సి ఉంటుందనే విషయం రాహుల్ గాంధీ, జగన్మోహన్ రెడ్డి గ్రహించినట్లు లేదు.
ఇదివరకు జగన్, కేసీఆర్ ప్రతిపక్షాలను ఉక్కుపాదాలతో తొక్కేసి అడ్డు తొలగించుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ చంద్రబాబు నాయుడు, అక్కడ రేవంత్ రెడ్డి ఎదురొడ్డి పోరాడి గెలిచారు.
అంతకు ముందు దేశాన్ని సోనియా గాంధీ పాలిస్తున్నప్పుడూ ఇంచుమించు ఇటువంటి పరిస్థితులే ఉండేవి. సీబీఐ, ఈడీ, ఐటి శాఖలను ప్రతిపక్ష నేతలపైకి ఉసిగొల్పుతూ వారిని లొంగదీసుకొని కట్టడి చేసేందుకు ప్రయత్నించేవారు. అప్పుడు నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపి ఆమెను, కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొని విజయం సాధించి అధికారంలోకి వచ్చింది.
కనుక ఇప్పుడు జగన్, కేటీఆర్, రాహుల్ ముగ్గురూ కూడా వారు ఎత్తి జూపుతున్న సమస్యలను, సవాళ్ళను ఎదుర్కొని విజయం సాధించాల్సి ఉంటుందని గ్రహిస్తే ఈవిదంగా కాలక్షేపం చేయరు.
రాహుల్ గాంధీ 2020లొ జరిగిన హర్యానా ఎన్నికలలో ఓట్లు చోరీ అయ్యాయంటూ కేంద్రాన్ని, ఎన్నికల కమీషన్‌ని విమర్శిస్తున్నప్పుడే బిహార్ శాసనసభ ఎన్నికలకు నేడు పోలింగ్ జరుగుతోంది.
కనుక ఈ ఎన్నికలలో కూడా దొంగ ఓట్లు పడకుండా ఎలా అడ్డుకున్నారనేదే ముఖ్యం తప్ప బస్తాల కొద్దీ దొంగ ఓట్ల జాబితాలు తెచ్చి మీడియాకు పంచడం వలన ఎటువంటి ఉపయోగమూ ఉండదు కదా?
ఇదేవిధంగా కేటీఆర్ కూడా కుదిరితే చెల్లి కల్వకుంట్ల కవితని మళ్ళీ వెనక్కు తెచ్చుకొని, బీఆర్ఎస్ పార్టీ పరిస్థితిని చక్కబెట్టుకొని ప్రజలలోకి వెళ్ళి కాంగ్రెస్ అసమర్ధత, వైఫల్యాలను ఎండగట్టాలి. కానీ ఆయన ఎంతసేపు సిఎం రేవంత్ రెడ్డిని పేరు పెట్టి విమర్శిస్తే చాలన్నట్లు వ్యవహరిస్తున్నారు.
ఏపీలో జగన్ తాడేపల్లి ప్యాలస్ గడప దాటడం లేదు. దాటితే బలప్రదర్శన తప్పనిసరి అన్నట్లు వ్యవహరిస్తున్నారు తప్ప నాడు తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు, టీడీపి నేతలు ఏవిదంగా ఎదురొడ్డి పోరాడారో గ్రహించడం లేదు.
కనుక రాష్ట్రంలో, దేశంలో నెలకొన్న వ్యతిరేక పరిస్థితులను ధీటుగా ఎదుర్కోగలిగితేనే ఈ మూడు పార్టీలు అధికారంలోకి రాగలవు కానీ అధికార పార్టీల తప్పొప్పులు, దురాగతాల జాబితాలు చదువుతూ ఎన్నేళ్ళు కాలక్షేపం చేసినా రాదు. ఇప్పటికే రెండేళ్ళ పుణ్యకాలం కాలక్షేపం చేసేశారు. ఇప్పటికైనా మేల్కొని లోపాలు సరిదిద్దుకొని ముందుకు సాగితే వారికే మంచిది.






