ఒకవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిజంగా “స్పెషల్ కేటగిరి స్టేటస్” వస్తే ఏమవుతుంది? పరిశ్రమల కోసమే కదా స్పెషల్ స్టేటస్ ఉపయోగపడేది…. పరిశ్రమ పెట్టి, ఒకవేళ లాభాలు వస్తే టాక్స్ లు కట్టనవసరం లేదు అన్నది మా ముఖ్యమంత్రి మాట. అసలు పరిశ్రమ ఎవడు పెడుతున్నాడు ఇవాళ, అలాంటి పరిస్థితి ఏపీలో ఉందా?
పెద్ద పెద్ద అమర్ రాజా వంటి ఇండస్ట్రీని కూడా మూయించేస్తుంటే, ఇంకా ఇండస్ట్రీ పెట్టడానికి ఎవడొస్తాడు? అసలు రాని ఇండస్ట్రీకి పన్ను రాయితీ ఏముంటుంది? 75% ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలంటే ఎవరైనా ఇస్తారు, కానీ స్థానిక రాష్ట్ర నాయకులకు వాటాలు ఇవ్వాలంటే ఎక్కడ నుండి తెచ్చి ఇస్తారు? ప్రధాన సమస్య అది.
నిజంగా స్పెషల్ స్టేటస్ ఇచ్చినా కూడా ఆంధ్రప్రదేశ్ ఉపయోగించుకునే పరిస్థితిలో లేదు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే తక్షణం చేయాల్సింది, అప్పులను, దుబారాలను ఆపాలి. 9 నెలల కాలంలో 900 శాతం రెవిన్యూ లోటు ఉంటే, ఇక ఈ మూడు నెలల్లో అది ఏ 1200 శాతానికో వెళ్ళిపోతుంది, అది తధ్యం, ఇటువంటి వాళ్ళు చేసేది పరిపాలనా? అంటూ రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు.
మాట్లాడితే కరోనా వచ్చిందంటారు, అసలు కరోనా వచ్చిన తర్వాతే కదా బడ్జెట్ ప్రతిపాదనలు చేసిందంటూ లాజిక్ గా మాట్లాడారు. భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర బడ్జెట్ లో ఎంత ఉపద్రవాలు వచ్చినా కూడా, ఏపీలో జరిగిన 900 శాతంలో కనీసం 1/4 శాతం కూడా ఎప్పుడూ కూడా జరగలేదు. మరి ఇలాంటి పాలకులను “రోగ్స్” అంటారా? లేక ఈ విధంగా పరిపాలన చేయకూడదు అని సూచనలు చేసిన వారిని “రోగ్స్” అంటారా? ఈ రెండూ ఒకటేనా? అంటూ నిలదీశారు.
ఏతావాతా ఆర్ఆర్ఆర్ చెప్పుకొచ్చేది ఏమిటంటే… జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో స్పెషల్ స్టేటస్ ఇచ్చినా కూడా రాష్ట్రానికి ఇసుమంత ప్రయోజనం కూడా చేకూరదన్న భావనను వ్యక్తపరిచారు. పరిశ్రమల నుండి స్థానిక నేతలు వసూళ్లు చేస్తున్నారన్న ఆరోపణను ఆర్ఆర్ఆర్ ఈ సందర్భంగా హైలైట్ చేసారు.



