ఇప్పటికే ఈ సీజన్ ఐపీఎల్ టోర్నీ నుండి ఔటైన ధోని సారధ్యంలోని పూణే జట్టు… పోతూ పోతూ ఢిల్లీ జట్టును కష్టాలలోకి నెట్టింది. వైజాగ్ వేదికగా జరిగిన మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ కేవలం 121 పరుగులను మాత్రమే చేయగా, లక్ష్య చేధనలో 11 ఓవర్లు ముగిసే సమయానికి వర్షం రావడంతో, డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 19 పరుగుల తేడాతో పూణే జట్టు విజయం సాధించినట్లుగా ఎంపైర్లు ప్రకటించారు. దీంతో ఢిల్లీ జట్టు కూడా బెంగుళూరు మాదిరి మిగిలిన 2 మ్యాచ్ లలోనూ తప్పనిసరిగా విజయం సాధించాల్సి ఉంది.
రెండు మ్యాచ్ ల ముందు వరకు టాప్ 4లో ఉన్న ఢిల్లీ జట్టు, ప్రస్తుతం 6వ స్థానానికి పడిపోయింది. హైదరాబాద్ జట్టు ఇప్పటికే ప్లే ఆఫ్స్ కు చేరుకోగా, మిగిలిన 3 స్థానాల కోసం 5 జట్లు… కోల్ కతా, ముంబై, గుజరాత్, బెంగుళూరు, ఢిల్లీ జట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. పాయింట్ల పట్టికలో చివరి నిముషంలో ఏ జట్టుకైనా షాక్ తగలవచ్చు. ఎందుకంటే, ఆయా జట్లు ఆడిన మ్యాచ్ ల కన్నా, ఇతర మ్యాచ్ లలో వచ్చిన ఫలితాలు, చివరి నిముషంలో మరింత ఉత్కంఠను రేపుతాయి.
ఈ 5 జట్లలో ఒక్క ముంబైను మినహాయిస్తే… మిగిలిన అన్ని జట్లకు 2 మ్యాచ్ లు ఉండడంతో ఏ జట్టుకైనా ప్లే ఆఫ్స్ కు చేరే అవకాశం దక్కుతుంది. అయితే కోల్ కతా, గుజరాత్ జట్లు ఇప్పటికే 14 పాయింట్లు సొంతం చేసుకుని, రెండు మ్యాచ్ లు ఆడాల్సి ఉండడంతో, మిగిలిన రెండు మ్యాచ్ లలో ఒక్కటి విజయం సాధించినా ప్లే ఆఫ్స్ కు చేరుకుంటాయి. అయితే ప్రస్తుతం టోర్నీలో మిగిలి ఉన్న మ్యాచ్ లలో ఎక్కువ శాతం మ్యాచ్ లు టాప్ 6 జట్ల మధ్య జరగనుండడం మరింత ఉత్కంఠను రేపే అంశం.



