తెలంగాణ రాజకీయాలలో హైదరాబాద్ పాతబస్తీ పరిధిలోని ఘోషా మహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అంటే ఓ ఫిరంగి లాంటివారు. బీజేపీ పెద్దలు ముస్లింల పట్ల వ్యతిరేకతని దాచుకొని తీయగా మాట్లాడుతారేమో కానీ రాజాసింగ్ అలా కాదు. మనసులో ఉన్నదంతా కక్కేస్తుంటారు. అందుకు ఓ సారి పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు కూడా . కానీ తెలంగాణ శాసనసభ ఎన్నికలకు ముందు బీజేపీ పెద్దలను ప్రసన్నం చేసుకొని సస్పెన్షన్ ఉపసంహరింపజేసుకున్నారు. టికెట్ సాధించి ఎన్నికలలో గెలిచారు కూడా.
కానీ ఈసారి తెలంగాణ బీజేపీ పెద్దలని టార్గెట్ చేసుకొని విమర్శించడం మొదలుపెట్టి కూర్చున్న కొమ్మని నరుక్కున్నారు. ఇటీవల తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహించాలనుకోవడం రాజసింగ్ కొంప ముంచింది.
కానీ అప్పటికే బీజేపీ అధిష్టానం అధ్యక్షుడిగా రామచందర్ రావు పేరు ఖరారు చేసేసి మొక్కుబడిగా ఎన్నికలు నిర్వహిస్తోందనే విషయం అనేక ఏళ్ళుగా రాజకీయాలలో, బీజేపీలో ఉన్న రాజాసింగ్‌కు తెలియదనుకోలేము. ఆయన కూడా నామినేషన్ వేయాలనుకున్నారు. బీజేపీ పెద్దల ఒత్తిడి వలన వేయలేకపోయారు.
ఆ ఆగ్రహంతో పార్టీ పెద్దలపై తీవ్ర విమర్శలు గుప్పించి, రాజీనామా లేఖని అప్పటి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపించారు. ఆవేశంతో చేసిన ఆ పొరపాటుని సరిదిద్దుకోవడానికి ఆయన కొత్తగా అధ్యక్షుడుగా ఎన్నికైన రామచందర్ రావుని కలిశారు కానీ ఆయన అంగీకరించలేదు. ఆ రాజీనామా లేఖని ఆమోదించి ఢిల్లీ పెద్దలకు పంపించేశారు.
అంత హిందూవాదిని, ఆవేశపరుడిని బీజేపీ నేతలే భరించలేకపోయారు. ఇక మిగిలిన పార్టీలు ఏం భరించగలవు? కనుక రాజాసింగ్ ఇప్పుడు రాజకీయ నిరుద్యోగిగా మారిపోయారు.
తన భావజలానికి దగ్గరగా ఉండే శివసేనలో చేరాలనుకుంటున్నారు. కానీ శివసేన రెండుగా చీలిపోయుంది. పైగా తెలంగాణలో శివసేన ఉనికే లేదు. దానిలో జేరితే ఆయనే దానిని భుజానికి ఎత్తుకొని మోయాల్సి ఉంటుంది. కనుక రాజాసింగ్ తాను ఆడిన రాజకీయ చదరంగంలో తానే పావుగా బలైపోయారనుకోవచ్చు.




