వరుసగా టాప్ హీరోల సినిమాలలో నటిస్తూ టాలీవుడ్ నెంబర్ 1 హీరోయిన్ గా అవతరించిన రకుల్ ప్రీత్ సింగ్ కు మరో బంపర్ ఆఫర్ తలుపు తట్టిందనే టాక్ టాలీవుడ్ ట్రేడ్ వర్గాలలో హల్చల్ చేస్తోంది. టాలీవుడ్ టాప్ హీరోలైన ప్రిన్స్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లు మినహా మిగతా హీరోల సరసన నటించిన రకుల్, ప్రస్తుతం మహేష్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఇక మిగిలింది పవర్ పవన్ కళ్యాణ్ ఒక్కరే కాగా, తాజాగా ఆ ముచ్చట కూడా తీరిపోయిందన్న వార్తలు హల్చల్ చేస్తున్నాయి.
‘జిల్లా’ ఫేం నీసన్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఇటీవల పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన తారాగణం ఎంపిక చేసే పనిలో ఉన్న దర్శకుడు నీసన్, హీరోయిన్ ను ఖరారు చేసారని, ఆమె మరెవరో కాదు, ప్రస్తుత ‘గోల్డెన్ లెగ్’ రకుల్ ప్రీత్ సింగ్ అన్న సమాచారం అందుతోంది. చిత్ర యూనిట్ అధికారికంగా ఖరారు చేయనప్పటికీ, రకుల్ కు ఈ ఆఫర్ వరించిందని తెలుస్తోంది.
పవన్ సినిమాతో తక్కువ సమయంలోనే అందరి అగ్ర హీరోల సరసన నటించిన హీరోయిన్ గా ఖ్యాతి పొందింది. అయితే టాప్ హీరోలలో ఒకరైన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో అవకాశం ఇంకా రానప్పటికీ, ప్రభాస్ ‘బాహుబలి’ సినిమాకే పరిమితం కావడంతో… బహుశా వచ్చే ఏడాదిలో ప్రభాస్ ను కూడా తన బుట్టలో వేసుకుంటుందేమో చూడాలి. సమంత తర్వాత సక్సెస్ రేషియో ఎక్కువ ఉన్న హీరోయిన్ గా రకుల్ పేరు బాగా హల్చల్ చేయడం వలనే ఇన్ని అవకాశాలు దరి చేరుతున్నాయని సినీ వర్గాలు చెప్తున్నాయి.



