వరుసగా ‘మూస’ మాస్ సినిమాలు చేస్తూ వస్తున్న మెగా వారసుడు రామ్ చరణ్ ను ‘ధృవ’ సినిమా గాడిలో పెట్టింది. రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించక పోయినప్పటికీ, రామ్ చరణ్ కు మంచి పేరు ప్రతిష్టతలను తెచ్చిపెట్టింది. అలాగే అంతకు ముందు ఒక వర్గానికే పరిమితం అయిన చెర్రీ పరిధిని పెంచిన చిత్రంగా ‘ధృవ’ నిలబడింది. అయితే ఇలాంటి సినిమా ఒప్పుకుని, తన ఉద్దేశం ఏమిటో దర్శకనిర్మాతలకు పరోక్షంగా హింట్ ఇచ్చాడు చెర్రీ.
అలాగే తదుపరి చిత్రంగా క్రియేటివిటీకి పరాకాష్ట అయిన సుకుమార్ సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్ళడంతో రామ్ చరణ్ పూర్తిగా మారిపోయి, కొత్త తరహా కధలకే ఓటు వేస్తున్నారన్న టాక్ ట్రేడ్ వర్గాల్లో బలపడింది. అందులోనూ ఇక నుండి కొత్తదనంతో కూడిన తెలుగు కధలనే రామ్ చరణ్ ఎంపిక చేసుకుంటారని కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే దానికి భిన్నంగా ‘ధృవ’ సినిమా మాదిరే, మరో రీమేక్ ను చేసే ఆలోచనలో రామ్ చరణ్ ఉన్నట్లుగా సినీ వర్గాల లేటెస్ట్ టాక్.
2014లో కన్నడనాట విడుదలై మంచి విజయం సాధించిన “బహద్దూర్” సినిమాను చెర్రీతో తెలుగులో రీమేక్ చేసేందుకు మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ హక్కులు తీసుకున్నట్లుగా సమాచారం. అయితే ‘ధృవ’ సినిమా ఎంత పేరు తెచ్చినా, రీమేక్ అన్న విమర్శలను కూడా మూటకట్టుకుంది. దీంతో మరోసారి రీమేక్ చేసే సాహాసం చెర్రీ చేస్తాడా? అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. సుకుమార్ సినిమా అంటేనే ఒక ప్రయోగం కావడంతో, ఈ ప్రాజెక్ట్ తర్వాత ‘సేఫ్ జోన్’లో భాగంగా రీమేక్ చేస్తే బాగుంటుందని ‘మెగా’ నిర్ణయంగా తెలుస్తోంది.



