ఇండియాలో ప్రజలు తమను తిట్టినా సహిస్తారేమో గానీ, తమ ఇష్ట దైవాలను శంకించినా, అవహేళనగా మాట్లాడినా, అవమాన రీతిలో వ్యాఖ్యలు చేసిన ఏ మాత్రం ఉపేక్షించరు. ఈ విషయం వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ విషయంలో మరొకసారి నిరూపణ అవుతోంది. 2014లో వినాయక నిమజ్జనం సందర్భంగా… వినాయకుడిపై వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేసిన వర్మ, ప్రస్తుతం దానికి తగిన మూల్యం చెల్లించుకోబోతున్నారు.
ప్రజల మత విశ్వాసాలను అవమానిస్తూ… రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసారని దాఖలు చేసిన పిటిషన్లో న్యాయపరమైన ప్రక్రియను ప్రారంభించేందుకు అంగీకరించిన ముంబై అంధేరీ కోర్టు జూలై 19వ తేదీ లోపున రాంగోపాల్ వర్మ కోర్టుకు హాజరు కావాలని, లేదంటే తన న్యాయవాది ద్వారా అయినా స్పందించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపధ్యంలో వర్మ ఎలాంటి వాదనతో ముందుకు వెళ్తారో చూడాలి. సహజంగా ‘లాజిక్’లతో కూడిన వ్యాఖ్యలు చేస్తూ… ‘వితండవాదుడి’గా వర్మకు విశేషమైన పేరు ఉంది. మరి కోర్టులను ఎలా బురిడీ కొట్టిస్తాడో చూడాలి.
అయితే, అప్పట్లో వరుస ట్వీట్లతో హోరెత్తించిన తర్వాత… భక్తుల మనోభావాలు దెబ్బతిని ఉంటే క్షమించాల్సిందిగా కూడా వర్మ ట్విట్టర్ ముఖంగా కోరారు. మరి ఇదే అభిప్రాయాన్ని న్యాయమూర్తి ముందు పెడతారో లేదో గానీ… దేవుడిపై చేసిన మాటలకు పర్యవసానాలు ఇలా ఉంటాయని చెప్పడం ప్రస్తుతం భక్తుల వంతు..! మరి మన భాష రజనీ స్టైల్లో చెప్పాలంటే… దేవుడు శాసించాడు… వర్మ పాటించాలి… అనే కదా..!



