బోయపాటి శ్రీను దర్శకత్వంలో హీరోగా తెరకెక్కిన “సరైనోడు” సినిమా అల్లు అర్జున్ కెరీర్లోనే టాప్ సినిమాగా నిలిచిన విషయం తెలిసిందే. ఫుల్ మాస్ సినిమాగా రూపుదిద్దుకున్న ఈ సినిమా కలెక్షన్స్ పై బన్నీ ఎప్పటికప్పుడు ఒక ఫోటోను పోస్ట్ చేసుకుంటూ వస్తున్నారు. 20 రోజులకు గానూ 100 కోట్లు గ్రాస్ వసూలు చేసిందన్న విషయం హాట్ టాపిక్ కాగా, తాజాగా 30 రోజుల పోస్టర్ ను విడుదల చేస్తూ మరో ట్వీట్ చేసారు.
“బాహుబలి సినిమాను మినహాయిస్తే…” అనే కండిషన్ ను పెట్టి విడుదల చేసిన ఈ పోస్టర్లోని రికార్డులపై ఒక్కొక్కరు ఒక్కో అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నప్పటికీ, దగ్గుపాటి వారసుడు హీరో రానా మాత్రం బన్నీకి ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేసాడు. ‘బాహుబలి మినహాయిస్తే…’ అన్న కండిషన్ ను దృష్టిలో పెట్టుకుని వ్యాఖ్యానించిన రానా… ‘మమ్ముల్ని ఎందుకు మినహాయించాలి…’ అంటూ చేసిన ట్వీట్ కు సోషల్ మీడియాలో విపరీతమైన స్పందన లభిస్తోంది.
పవన్ కళ్యాణ్ పై చేసిన ‘చెప్పను బ్రదర్’ వివాదానికి ముగింపు పలికిన కొద్ది గంటలకే అల్లు అర్జున్ చేసిన ట్వీట్ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ కావడం విశేషం. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ‘బాహుబలి’ సినిమా రికార్డులను ఎందుకు మినహాయించాలి? కేవలం పోస్టర్లలో ‘ఫస్ట్’ అని చూపించుకోవడం కోసమే ‘బాహుబలి’ రికార్డులను మినహాయించి అంటూ పోస్టర్ ను డిజైన్ చేసి ఉంటారని, కలెక్షన్స్ కోసం, రికార్డుల కోసం పడే ఆరాటంలా కనపడుతోందని సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ.



