ఇటీవల రాజుకున్న ‘ప్రత్యేక హోదా’ అంశం కేంద్రంగా బిజెపి – టిడిపిల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. తాజాగా మరోసారి టిడిపి, బిజెపి మధ్య మరోసారి మాటల దాడి జరుగుతోంది. ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై బీజేపీ నిర్లక్ష్యం వహిస్తోందని, బీజేపీతో ఉంటే ప్రత్యేక హోదా సాధించలేం తెలుగుదేశం సీనియర్ నేత, ఎంపీ రాయపాటి సాంబశివరావు భారతీయ జనతా పార్టీపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు న్యాయం చేయకపోతే బీజేపీకే నష్టం కలుగుతుందని, ప్రస్తుతం బీజేపీ పరిస్థితి బాగోలేదని విమర్శించారు. కేరళలో ఒక్క సీటు సాధించినందుకే బీజేపీ సంబరాలు జరుపుకుంటోందని, దక్షిణాదిన బీజేపీ బలపడే అవకాశం లేదని, బీజేపీతో ఉంటే ప్రత్యేక హోదాను సాధించలేమని, రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయని విమర్శలు కురిపించడం విశేషం.
ఇదిలా ఉంటే, బిజెపి తరపున వకాల్తా పుచ్చుకున్న బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్… ఏపీకి సాయం అందలేదన్నది పచ్చి అబద్ధమని ఖండించారు. ఏపీ ప్రజల్లో ప్రత్యేక హోదా సెంటిమెంట్ బలంగా ఉందని, ప్రత్యేక హోదాపై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఏపీలో బీజేపీ బలోపేతానికి పాటు పడతామని, రెండు సీట్ల స్థాయి నుంచి అధికారం చేపట్టే స్థాయికి అసోంలో చేరామని, ఏపీలో కూడా అదే స్థాయికి చేరుకుంటామని పేర్కొన్నారు.



