ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధికి నోచుకోని జిల్లాలలో ప్రకాశం కూడా ఒకటి. ప్రకాశం జిల్లా అంటే తీవ్ర నీటి సమస్యలు, మౌలిక వసతుల లేమి, పనికిమాలిన రాజకీయాలు మాత్రమే అన్నట్లు ఉండేది ఇంతకాలం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పుడు జిల్లాలో అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయి. రిలయన్స్ వంటి భారీ పరిశ్రమలు కూడా వస్తున్నాయి.
జిల్లాలో పీసీపల్లి మండలం దివాకరపల్లి వద్ద రిలయన్స్ కంపెనీ కాంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్ (సీబీజీ)ఏర్పాటు చేయబోతోంది. ప్రకాశం జిల్లాలో నెలకొల్పబోతున్న ఈ ప్లాంట్‌లో వ్యవసాయ, పారిశ్రామిక, ఇతర ఘన వ్యర్ధాలను ఉపయోగించి కంప్రెస్డ్ గ్యాస్ ఉత్పత్తి చేస్తారు.
రిలయన్స్ సంస్థ రూ.65,000 కోట్ల పెట్టుబడితో మొత్తం 500 సీబీజీలను ఏర్పాటు చేయబోతోంది. ఒక్కో ప్లాంట్‌లో రోజుకి 22 టన్నుల గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. ఒక్కో గ్యాస్ ప్లాంట్‌లో సుమారు 500 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. ఈ లెక్కన 500 ప్లాంట్‌లలో మొత్తం 2.50 లక్షల మందికి ఉద్యోగాలు లభిస్తాయి.
ఈ ప్లాంట్స్‌కు అవసరమైన ముడి సరుకు అందించేందుకు ఒక్కో ప్లాంట్ పరిధిలో సుమారు వెయ్యి ఎకరాలలో ఎనర్జీ ప్లాంటేషన్ చేస్తారు. కనుక ఆ మేరకు రైతులు లబ్ధి పొందుతారు.
ఈ ప్లాంట్ ముడిసరుకు పారిశ్రామిక, మునిసిపల్ వ్యర్ధాలు కనుక ఈ ప్లాంట్ చుట్టుపక్కల ప్రాంతాలలో వ్యర్ధాలు ఎప్పటికప్పుడు సేకరిస్తుండటం వలన పల్లెలు, పట్టణాలలో పరిశుభ్రంగా మారుతాయి.
రిలయన్స్ సంస్థ దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాలలో సీబీజీ ప్లాంట్స్ ఏర్పాటు చేస్తోంది. వాటిలో ఒకటి ప్రకాశం జిల్లాలో ఏర్పాటవుతోంది. ఈ ప్లాంట్స్ ద్వారా కంప్రెస్డ్ గ్యాస్‌తో పాటు భారీగా సేంద్రీయ ఎరువు కూడా ఉత్పత్తి అవుతుంది.
ప్రకాశం జిల్లాలో ఏర్పాటు కాబోతున్న ఈ రిలయన్స్ సీబీజీ ప్లాంట్‌కి మంత్రి నారా లోకేష్ నేడు భూమిపూజ చేస్తారు. ఆరు-తొమ్మిది నెలల్లోగా ప్లాంట్ నిర్మాణ పనులు పూర్తి చేసి వచ్చే జనవరి నుంచి కంప్రెస్డ్ గ్యాస్ ఉత్పత్తి ప్రారంభించే అవకాశం ఉంది.




