
ఎవరు అవునన్నా కాదన్నా అన్ని రాజకీయ పార్టీలకు బీసీ ఓట్లే చాలా కీలకం. కనుక ఏదో విదంగా వారిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉంటాయి.
తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ, సమగ్ర కులసర్వేలు, రిజర్వేషన్ల విషయంలో చాలా దూకుడుగా వ్యవహరించి ఎదురుదెబ్బలు తిన్న తర్వాత వాటి నుంచి బయటపడేందుకు బీసీలకు విద్యా, ఉద్యోగాలలో 42 శాతం రిజర్వేషన్స్ పెంచుతూ శాసనసభలో తీర్మానం చేసి ఢిల్లీకి పంపారు.
Also Read – వైసీపీ బుట్టలో ఎల్ఐసీ… గిలగిలా కొట్టుకుంటోంది పాపం!
కానీ దానిని కేంద్రం ఆమోదించదని రేవంత్ రెడ్డికి, శాసనసభలో ఆ బిల్లుకి మద్దతు ఇచ్చిన ప్రతిపక్షాలకు తెలుసు. ఆ బిల్లు పేరుతో తమని ప్రసన్నం చేసుకొని కాంగ్రెస్ పార్టీవైపు తిప్పుకోవాలని ప్రయత్నిస్తున్నారని బీసీలకు కూడా తెలుసు.
తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి ఆచరణ సాధ్యం కాని బిల్లుతో రాజకీయ మైలేజ్ పొందాలని ప్రయత్నిస్తే, ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు అందుకు పూర్తి భిన్నంగా ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ చట్టం వంటిదే బీసీల రక్షణకు ఓ చట్టం తీసుకువస్తామని చెప్పారు.
Also Read – ఏ.ఆర్. రెహమాన్‌కు 2 కోట్ల జరిమానా!
సిఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఈ హామీని అమలు చేయడానికి కేంద్రం అనుమతి అవసరం ఉండదు. రాష్ట్ర ప్రభుత్వమే ఈ బిల్లుకి చట్ట రూపం కల్పించి అమలు చేయవచ్చు.
నేటికీ రాజకీయ పార్టీలలో అగ్రకులాల నేతలు బీసీల పట్ల చులకన భావం ప్రదర్శిస్తుంటారు. జగన్ హయంలో తమని షో పీసులుగా వాడుకునేవారని ఆ పార్టీని వీడిన బడుగు బలహీన వర్గాల నేతలు, కార్యకర్తలు చెపుతుంటారు.
Also Read – కేసీఆర్ వైఖరిలో అనూహ్య మార్పులు.. ఏమవుతుందో?
కనుక సిఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఈ హామీ వలన బీసీలకు సముచిత గౌరవం లభిస్తుంది. అందుకు వారు కూడా సంతోషిస్తారు.
అనుభవజ్ఞుడైన సిఎం చంద్రబాబు నాయుడు ఆచరణ సాధ్యమైన హామీని ఇచ్చి నిలబెట్టుకోబోతుంటే, ఆవేశపరుడైన తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి ఆచరణకు నోచుకోని హామీని ఇచ్చి ప్రజలు, బీసీల దృష్టిలో తన విశ్వసనీయతని తగ్గించుకున్నారు. అనుభవానికి, ఆవేశానికి తేడా ఇదే కదా?