ఆంద్రావాళ్ళ ఓట్లు కావాలి కానీ వారిని గౌరవించరా?

Anumula-Revanth-Reddyతెలంగాణ సిఎం కేసీఆర్‌ కుటుంబంలో అందరికీ మంచి వాక్చాతుర్యం ఉంది. దాంతో వారు నందిని పందని, పందిని నందని వాదించి ఒప్పించగలరని అందరికీ తెలుసు. “ఏపీలో వైసీపి, టిడిపిల మద్య జరుగుతున్న పంచాయితీని అక్కడే తేల్చుకోవాలి కానీ ఇక్కడ హైదరాబాద్‌లో ఐ‌టి ఉద్యోగులు ఆందోళనలు చేయడం దేనికి?చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ ఆందోళనలు చేయదలుచుకొంటే ఏపీకి వెళ్ళి అక్కడ చేసుకోవాలి కానీ ఇక్కడ హైదరాబాద్‌లో శాంతిభద్రతల సమస్యలు సృష్టిస్తామంటే కుదరదు,” అంటూ మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యాలే ఇందుకు చిన్న ఉదాహరణ.

ADVERTISEMENT

కేటీఆర్‌ చాలా తెలివిగా, లౌక్యంగా మాట్లాడారని అని అర్దమవుతూనే ఉంది. కానీ తెలంగాణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఆయనకు చురకలు వేస్తూ చేసిన వ్యాఖ్యలు చాలా ఆలోచింపజేస్తాయి.

“చంద్రబాబు నాయుడు ఏపీకి మాత్రమే పరిమితమైన రాజకీయ నాయకుడు కారు. ఆయన కేసీఆర్‌ కంటే చాలా ముందే జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పారు. దేశంలోని అత్యంత సీనియర్ రాజకీయ నాయకులలో ఆయన కూడా ఒకరు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు.

అటువంటి వ్యక్తిని జగన్‌ ప్రభుత్వం రాజకీయకక్షతో అరెస్ట్ చేస్తే కేసీఆర్‌, కేటీఆర్‌ వెంటనే ఖండించకపోగా, ఆయనకు సంఘీభావం తెలుపుతున్న ఐ‌టి ఉద్యోగుల వలన హైదరాబాద్‌లో శాంతి భద్రతల సమస్య వస్తుందని చెప్పడం సిగ్గుచేటు.

హైదరాబాద్‌లో స్థిరపడిన ఆంధ్రావాళ్ళ ఓట్లు కావాలి కానీ వారి అభిప్రాయాలను, హక్కులను గౌరవించరా?ఆంధ్రాలో మీరు బిఆర్ఎస్ పార్టీని పెట్టుకొని రాజకీయాలు చేయవచ్చు కానీ ఆంద్రావాళ్ళు ఇక్కడ నోరెత్తకూడదా?వాళ్ళు కట్టే పన్నులు మీ ప్రభుత్వానికి కావాలి కానీ వారి రాజకీయ హక్కులను మీరు గౌరవించరా?చంద్రబాబు అరెస్టుపై ఇక్కడ ఎవరూ నిరసనలు తెలపకూడదు కానీ మీరు ఢిల్లీకి వెళ్ళి నిరసనదీక్షలు చేయవచ్చా?

అయినా 10 ఏళ్ళపాటు రెండు తెలుగు రాష్ట్రాలకు హైదరాబాద్‌ ఉమ్మడి రాజధాని అనే విషయం కేసీఆర్‌, కేటీఆర్‌ మరిచిపోయిన్నట్లున్నారు. హైదరాబాద్‌ ఏమైనా మీ జాగీరా? ఇక్కడ ఎవరు ధర్నాలు చేయకూడదని చెప్పడానికి?

ఇక్కడ స్థిరపడిన ఆంద్రావాళ్ళ హక్కులను గౌరవించకపోతే త్వరలో జరుగబోయే ఎన్నికలలో వాళ్ళే మీకు తగిన విధంగా బుద్ధి చెపుతారు. ఈసారి మీరిద్దరూ ఆంద్రాలో అడుగుపెడితే అక్కడా జనాలు మీకు బుద్ధి చెపుతారు. కనుక చంద్రబాబు నాయుడు అరెస్టుపై మీరు స్పందించకపోయినా, ఇక్కడ ఆంధ్రావాళ్ళు, ఐ‌టి ఉద్యోగులు ఖండిస్తూ నిరసనలు తెలపాలనుకొంటే అడ్డుకోవడం కాదు. వారిని అనుమతించి వాళ్ళ రాజకీయ హక్కులను గౌరవించి, మీ గౌరవం నిలబెట్టుకొంటే మీకే మంచిది,” అంటూ రేవంత్‌ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ADVERTISEMENT
Latest Stories