తెలంగాణ రాజకీయాలలో గత వారం పది రోజుల వ్యవధిలోనే అనేక పరిణామాలు జరిగాయి.
కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమీషన్ కేసీఆర్, హరీష్ రావులకు నోటీసులు జారీ చేసింది. ఫార్ములా 1 రేసింగ్ కేసులో విచారణకు హాజరవ్వాలంటూ తెలంగాణ ఏసీబీ కేటీఆర్‌కి నోటీసులు జారీ చేసింది.
బిఆర్ఎస్ పార్టీలో హరీష్ రావు, కేటీఆర్ మద్య ఆధిపత్యపోరు పతాకస్థాయికి చేరుకుంది. ఆయన పార్టీ వీడబోతున్నారంటూ ఊహాగానాలు వినిపించాయి. వెంటనే కేటీఆర్ రెండు రోజులు వరుసగా ఆయన ఇంటికి వెళ్ళి భేటీ అయ్యారు.
హరీష్ రావు చల్లబడ్డారనుకుంటే కల్వకుంట్ల కవిత తండ్రిని విమర్శిస్తూ లేఖ వ్రాసి, ఆయన చుట్టూ దెయ్యాలు, భూతాలు తిరుగుతున్నాయంటూ బహిరంగంగా విమర్శలు గుప్పించడం బిఆర్ఎస్ పార్టీలో అందరికీ పెద్ద షాక్ అనే చెప్పాలి.
తాజాగా ఆమె సొంత కుంపటి పెట్టుకునేందుకు సిద్దం అవుతున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆమె తెలంగాణ జాగృతి నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తుండటంతో అవి నిజమే అనిపిస్తుంది.
బిఆర్ఎస్ పార్టీని ఒకేసారి ఇన్ని సమస్యలు చుట్టుముట్టగా వాటి నుంచి ఏవిదంగా బయటపడాలని చూస్తున్న కేసీఆర్‌కు నోటీస్ ఇవ్వడం ద్వారా తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి స్వయంగా దారి చూపించారని చెప్పవచ్చు.
కమీషన్ విచారణకు కేసీఆర్ హాజరుకారని, అప్పుడు మళ్ళీ విమర్శించవచ్చని కాంగ్రెస్ మంత్రులు భావించారు. కానీ ఆయన జూన్ 5న కమీషన్ ముందు హాజరయ్యి తన వాదనలు వినిపించాలని నిర్ణయించారు.
కనుక బిఆర్ఎస్ పార్టీ అప్పుడే అదేదో ఘన కార్యమన్నట్లు ప్రచారం మొదలుపెట్టేసింది. బిఆర్ఎస్ పార్టీ చేసే ఈ హడావుడితో ఆ పార్టీలో జరుగుతున్న ఆధిపత్యపోరు, అంతర్గత కుమ్ములాటలపై నుంచి ప్రజల దృష్టి మళ్ళించవచ్చు.
కనుక కేసీఆర్, హరీష్ రావులకు కమీషన్ చేత నోటీసులు ఇప్పించడం ద్వారా బిఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్‌కి ఈ గొప్ప అవకాశం కల్పించింది సిఎం రేవంత్ రెడ్డి అనే చెప్పక తప్పదు.
కమీషన్ గడువు ముగియడంతో కేసీఆర్, హరీష్ రావులను ప్రశ్నించకుండానే నివేదిక తయారుచేసి సిఎం రేవంత్ రెడ్డికి అప్పగించేందుకు కమీషన్ సిద్దం కాగా, వారికి నోటీసులు ఇచ్చి విచారణ జరపాలనే ఉద్దేశ్యంతో కమీషన్ గడువు జూన్ నెలాఖరు వరకు పెంచారు. అదే ఇప్పుడు కేసీఆర్, బిఆర్ఎస్ పార్టీకి వరంగా మారిందని చెప్పవచ్చు.




