
నిన్నటి నుంచి తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు మొదలయ్యాయి. నేడు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతోంది. శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టక మునుపే సిఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో వివరిస్తూ, “నెలకు రూ.18,000-18,500 కోట్లు ఆదాయం వస్తే దానిలో 13,500 కోట్లు అప్పులు, వడ్డీలు చెల్లింపులకి, ఉద్యోగుల జీతాలకు వెళ్లిపోతోందని, మిగిలిన రూ.5,000 కోట్లతో అతికష్టం మీద రాష్ట్రాన్ని నెట్టుకు వస్తున్నానని చెప్పారు.
సిఎం రేవంత్ రెడ్డి ఈవిదంగా చెప్పడాన్ని బిఆర్ఎస్ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించి తెలంగాణ అంతా నీళ్ళు పారించి రైతులకు ఎంతో మేలు చేస్తే, ఆయన మీద కక్షతో రేవంత్ రెడ్డి దానిని పాడుబెట్టి రైతులకు నీళ్ళు అందకుండా చేస్తున్నారు. తెలంగాణకు గర్వకారణమైన కాళేశ్వరాన్ని కూలేశ్వరం అంటూ చాలా చులకనగా మాట్లాడుతున్నారు.
Also Read – కొత్త జట్టుకు పాత గుర్తులు ఇవ్వగలడా..?
రేవంత్ రెడ్డికి పాలన చాతకాకనే కేసీఆర్‌ని బూతులు తిడుతున్నారు. కాంగ్రెస్ అధిష్టానం ఆయనని పట్టించుకోవడం లేదు. అందువల్లే ఏడాదిన్నర కావస్తున్నా ఇంతవరకు తన మంత్రివర్గంలో ఆరుగురు మంత్రులను నియమించుకోలేకపోయారు. ఉద్యోగులకు జీతాలు చెల్లించలేకపోతున్నానని చెప్పుకుంటున్న సిఎం రేవంత్ రెడ్డి తన నిసహాయతని కప్పిపుచ్చుకునేందుకే మాపై అసహనం వ్యక్తం చేస్తున్నారు,” అంటూ బిఆర్ఎస్ పార్టీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
తెలంగాణలో తిరుగే లేని కేసీఆర్ అంతటివాడిని రేవంత్ రెడ్డి ఓడించడం మామూలు విషయం కానే కాదు. కానీ పాలన విషయంలో కూడా తాను కేసీఆర్ కంటే గొప్ప దక్షుడునని రేవంత్ రెడ్డి నిరూపించుకోవడం కూడా అంతే ముఖ్యం. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దయనీయంగా ఉందని తెలిసి ఉన్నా ఎన్నికలలో గెలిచేందుకు అనేక హామీలు ఇచ్చారు. కనుక గత ప్రభుత్వాన్ని నిందిస్తూ, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగోలేదని చెప్పుకుంటే ఎవరూ జాలిపడరు. ఇటువంటి విమర్శలే వస్తాయి. ఏది ఏమైనప్పటికీ రాజకీయాలలో గొప్పగా రాణించిన రేవంత్ రెడ్డి పాలనలో తడబడుతున్నట్లనిపిస్తుంది.
Also Read – బెట్టింగ్ రాజాలు…సిద్ధమా.?
రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఉద్యోగులకు జీతాలు చెల్లించలేనంత దయనీయంగా ఉందని రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పుకున్నారు. మేడిగడ్డ బ్యారేజ్‌లో మూడు పియర్స్ క్రుంగిపోయినందున కాళేశ్వరం ప్రాజెక్టుని ఉపయోగించుకోలేమంటూ పక్కన పెట్టేశారు.
ఆయన చెప్తున్న మాటలు, బిఆర్ఎస్ నేతలు చేస్తున్న ఈ విమర్శలు కలిపి చూస్తే, ఇదివరకు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏపీలో ఏం జరిగిందో ఇప్పుడు తెలంగాణలో అదే జరుగుతోందనిపిస్తుంది.