తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డితో సహా కాంగ్రెస్ పెద్దలందరూ ప్రస్తుతం ఢిల్లీలో బీసీ రిజర్వేషన్స్ కోసం ధర్నా చేస్తున్నారు. మరోపక్క ‘బీసీ రిజర్వేషన్స్’ కోసమే హైదరాబాద్, ఇందిరా పార్కులో తెలంగాణ జాగృతి అధ్యక్షురాయలు కల్వకుంట్ల కవిత కూడా మూడు రోజులు దీక్ష చేస్తున్నారు.
కాంగ్రెస్ నేతలు దీని కోసం మోడీ ప్రభుత్వంతో పోరాడుతుంటే, కల్వకుంట్ల కవిత దీని కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో పోరాడుతున్నారు. కనుక అందరి ధ్యేయం బీసీ రిజర్వేషన్స్ సాధించడమే అని పైకి కనిపిస్తున్నప్పటికీ, ఎవరి యుద్ధాలు వారివే… ఎవరి ఆలోచనలు వారివే. కనుక వాటి నుంచి వారు ఆశిస్తున్న ఫలితాలు కూడా వేర్వేరుగానే ఉంటాయి.
కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయిలో బీజేపీ శత్రువు. కానీ బీజేపీ ధాటికి తట్టుకోలేకపోతోంది. త్వరలో బీహార్ శాసనసభ ఎన్నికలు జరుగబోతున్నాయి.
ఆ రాష్ట్రంలో బీసీ జనాభా చాలా ఎక్కువే. కనుక ఢిల్లీలో చేస్తున్న ఈ హడావుడితో బహుశః వారిని ఆకట్టుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచన కావచ్చు.
ఢిల్లీ దీక్ష బీసీల కోసం కాదని ముస్లింలకు రిజర్వేషన్స్ కల్పించడం కోసమేనని తెలంగాణ బీజేపీ ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఇది కూడా ఆలోచించాల్సిన విషయమే. ఎందుకంటే, యూపీ, బీహార్, పశ్చిమ బెంగాల్, తెలంగాణ మరికొన్ని రాష్ట్రాలలో ముస్లిం జనాభా చాలా ఎక్కువే.
కనుక ఒకవేళ ఈ బీసీ బ్రహ్మాస్త్రం ఫలించి బీహార్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే, ఇకపై ఎన్నికలు జరుగబోయే రాష్ట్రాలలో జనాభాకి తగ్గట్లుగా ఇదే అస్త్రాన్ని మార్పులు చేర్పులు చేసుకొని ప్రయోగిస్తూ లబ్ధి పొందే ప్రయత్నం చేయవచ్చు.
హైదరాబాద్‌లో కల్వకుంట్ల కవిత దీక్షలు దేనికో అందరికీ తెలుసు. బీఆర్ఎస్ పార్టీ నుంచి దూరం అయిన తర్వాత ఆమె తన రాజకీయ మనుగడ కాపాడుకోవడం కోసం చాలా శ్రమిస్తున్నారు. అందుకు ఈ అస్త్రం వాడుకుంటున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఆమె బీసీ అస్త్రాన్ని హైజాక్ చేసి ఎత్తుకుపోయింది. దానిపై సర్వహక్కులు తనకి మాత్రమే ఉన్నాయని చాటింపు వేసుకునేందుకు దీక్ష చేస్తున్నారేమో?
ఇదివరకు షర్మిల తెలంగాణలో సొంత కుంపటి పెట్టుకున్నప్పుడు, ఆమె కూడా ఇలాగే కేసీఆర్‌ని విమర్శిస్తూ ప్రజలను ఆకట్టుకోవాలని ఆరాటపడేవారు. కానీ ఏపీకి షిఫ్ట్ అయిన తర్వాత తెలంగాణ సమస్యలు గాలికొదిలేసి, ఇప్పుడు ఏపీ ప్రజల సమస్యల కోసం పోరాడుతున్నా అంటూ జగన్‌పై కత్తులు దూస్తున్నారు.
కనుక బీసీ రిజర్వేషన్స్ లేదా ప్రజా సమస్యల కోసం పోరాటాలు కేవలం ఓ సాకు మాత్రమే. అసలు కారణాలు, దాని కోసం అనుసరించే విధానాలు, అంతిమ ఫలితాలు వేరేగానే ఉంటాయి.






