రిజర్వేషన్స్ సంబందిత సామాజిక వర్గాలకు ఉపయోగపడాలి. కానీ రాజకీయ పార్టీలే రిజర్వేషన్స్ అంశాన్ని ఎక్కువగా వాడేసుకొని రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నాయి. తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద చేస్తున్న ధర్నా కూడా ఇటువంటిదే అని భావించవచ్చు.
బీసీలకు 37 శాతం, ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్స్ పెంచాలని మాజీ సిఎం కేసీఆర్ ఇదివరకు శాసనసభలో తీర్మానాలు చేసి ఢిల్లీకి పోస్టుబాక్సులో వేసి చేతులు దులుపుకున్నారు. “రిజర్వేషన్స్ విషయంలో మాకు చాయా నిబద్దత ఉంది కానీ కేంద్రం సహకరించడం లేదు ఏం చేస్తాం?” అని కేంద్రాన్ని నిందిస్తూ ఆయా వర్గాలను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నించారు.
అప్పుడే బీసీలకు 37 శాతం రిజర్వేషన్స్ ఒప్పుకోని కేంద్రం ఇప్పుడు 42 శాతానికి పెంచమంటే ఒప్పుకుంటుందా? అంటే కాదనే అర్దమవుతుంది. కనుకనే శాసనసభలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్స్ పెంచుతూ తీర్మానం ప్రవేశపెట్టగా, దానికి ఎలాగూ మోక్షం లభించదని బిఆర్ఎస్ పార్టీకి తెలుసు కనుక మద్దతు ఇచ్చింది. దానికి ఏకగ్రీవంగా ఆమోదముద్ర పడింది.
కానీ రాజ్యాంగం ప్రకారం అన్ని వర్గాలకు కలిపి రిజర్వేషన్స్ 50 శాతం మించకూడదు కనుక ఇది అమలు కావాలంటే పార్లమెంటులో చట్ట సవరణ అవసరం.
మోడీ ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రతీ బిల్లుని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించిన బీసీలకు 42 శాతం రిజర్వేషన్స్‌ని కేంద్రం ఎందుకు అంగీకరిస్తుంది?ఎందుకు సహకరిస్తుంది?సహకరిస్తే దేశవ్యాప్తంగా మళ్ళీ రిజర్వేషన్స్ అనుకూల వ్యతిరేక ఉద్యమాలు మొదలవుతాయని కేంద్రానికి తెలియదా?
కనుక తెలంగాణ ప్రభుత్వం పంపిన ఆ ప్రతిపాదనని పట్టించుకోలేదు.. అని సిఎం రేవంత్ రెడ్డికి కూడా తెలుసు. కనుక నేడు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఈ అంశంపై ధర్నా చేస్తున్నారు. దీనితో ఆయన కేంద్రంపై ఒత్తిడి తేలేరు. కేవలం కాంగ్రెస్ అధిష్టానం దృష్టిలో పడగలరు అంతే.
ఈ అంశంపై దేశంలో అన్ని పార్టీలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తానని సిఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కానీ రేవంత్ రెడ్డి అటువంటి ప్రయత్నాలు చేయాలంటే ముందుగా కాంగ్రెస్ అధిష్టానం అనుమతి కావాలి. రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్స్ అంశంతో జాతీయస్థాయిలో రాజకీయాలు చేసేందుకు అనుమతిస్తే పార్టీ శ్రేణులకు, ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపిన్నట్లవుతుంది. కనుక కాంగ్రెస్ అధిష్టానం అంగీకరించకపోవచ్చు.
కానీ తెలంగాణ రాజకీయాలపై బీసీ రిజర్వేషన్స్ పెంపు ప్రభావం దృష్టిలో ఉంచుకొని ఢిల్లీలో ఒక్కరోజు దీక్షకు అనుమతించింది. కేంద్రం రిజర్వేషన్స్ పెంచదు. జాతీయ స్థాయిలో ఉద్యమాలకు కాంగ్రెస్ అధిష్టానం అనుమతించదు. కనుక ఇక్కడితో ఈ కధ సమాప్తం అయిన్నట్లే భావించవచ్చు.




