అవును.. ఓటమికి మించిన శిక్ష లేదు!

kcr-jagan-revanth-reddy

తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి నోట కొన్నిసార్లు ఆణిముత్యాలు జాలువారుతుంటాయి.గురువారం ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ చేస్తూ, “కేసీఆర్‌కి ఓటమికి మించిన మరో శిక్ష లేదు. ఏడాదిన్నరగా ఫామ్‌హౌసులో తనను తాను బందించుకొని ఆ శిక్ష అనుభవిస్తున్నారు.

చర్లపల్లి జైలుకి, ఫామ్‌హౌసుకి పెద్దగా తేడా లేదు. జైలు వద్ద పోలీసులు ఉంటారు. ఫామ్‌హౌసు చుట్టూ కూడా పోలీసులున్నారు.ములాఖాత్ సమయంలో జైలులో ఖైదీలని కలిసేందుకు సందర్శకులు వస్తుంటారు. అదేవిదంగా ఫామ్‌హౌసులో ఉన్న కేసీఆర్‌ని కలిసేందుకు కూడా అప్పుడప్పుడు సందర్శకులు వచ్చి పోతుంటారు. చర్లపల్లి జైలుకి ఫామ్‌హౌసుకి తేడా ఏముంది?” అని అన్నారు.

ADVERTISEMENT

రేవంత్ రెడ్డి చెప్పింది అక్షరాల నిజమే. అయితే ఇది కేసీఆర్‌కి మాత్రమే కాదు… ఏపీ మాజీ సిఎం జగన్మోహన్ రెడ్డికి కూడా ఇదే వర్తిస్తుంది. కేసీఆర్‌, జగన్‌ ఇద్దరూ తమకి తిరుగే లేదనుకున్నారు. ప్రజలు తమకి తప్ప మరొకరిని కన్నెత్తి చూడరనుకున్నారు. మా మాటే శాసనమన్నారు.

జగన్‌ అహంభావంతో 175కి 175 సీట్లు మేమే గెలుచుకుంటామని చెప్పుకున్నారు. ఓ విధంగా చెప్పాలంటే ఎన్నికలు లాంఛనప్రాయమే అన్నట్లు ఇద్దరూ మాట్లాడేవారు.
అలా ప్రగల్భాలు పలికినవారిని ప్రజలు తిరస్కరిస్తే వారికి అంతకంటే అవమానం ఏముంటుంది. అంతకంటే పెద్ద శిక్ష ఏముంటుంది? అందుకే ఒకరు ఫామ్‌హౌసులో మరొకరు ప్యాలస్‌లో తమని తాము నిర్బందించుకొని శిక్ష అనుభవిస్తున్నారని భావించవచ్చు.

తాము ఎంతగానో ద్వేషించే రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు చేత్తుల్లో ఓడిపోవడం వారికి తల కొట్టేసినట్లే. వారిద్దరూ ముఖ్యమంత్రి హోదాలో శాసనసభలో మాట్లాడుతుంటే, వారి ముందు చేతులు కట్టుకొని కూర్చోవడం అవమానంగానే అనిపిస్తుంది కదా?అందుకే కేసీఆర్‌, జగన్‌ ఇద్దరూ శాసనసభ సమావేశాలకు రావడం మానుకున్నారు.

కానీ ఇదివరకు కేసీఆర్‌ చేతిలో కాంగ్రెస్‌ రెండు సార్లు ఓడిపోయింది. జగన్‌ చేతిలో టీడీపి ఒకసారి ఓడిపోయింది. కానీ కాంగ్రెస్‌, టీడీపిలు రాజకీయాలలో జయాపజయాలు సహజమని అంగీకరించాయి. ఓటమిని అంగీకరించి ఆత్మవిమర్శ చేసుకొని, లోపాలను సరిదిద్దుకున్నాయి.అక్కడ రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీని గాడిలో పెట్టుకొని కేసీఆర్‌తో పోరాడి గెలిచారు.

ఇక్కడ చంద్రబాబు నాయుడు ఓటమి తర్వాత జగన్‌లాగ ఇంట్లో కూర్చుండిపోలేదు. రేయనక పగలనక 5 ఏళ్ళపాటు నిత్యం ప్రజల మద్యే తిరిగారు. పార్టీ శ్రేణులని ఉత్తేజపరిచారు. జగన్‌ పాలన ఎండగడుతూ ప్రజలకు దగ్గరయ్యారు. జగన్‌ని ఓడించి మళ్ళీ అధికారంలోకి వచ్చారు.కేసీఆర్‌ తమిళనాడులో ద్రవిడ పార్టీలను (డీఎంకే, అన్నాడీఎంకే)ళ విధానాలను ఆదర్శంగా తీసుకొని పనిచేయాలని చెపుతుంటారు.

కానీ కళ్ళెదుటే ఉన్న రేవంత్ రెడ్డిని, చంద్రబాబు నాయుడుని చూసి నేర్చుకోవడానికి కేసీఆర్‌, జగన్‌లకి అహం అడ్డొచింది. ఆ అహమే వారి పార్టీల ఓటమికి శాపంగా మారింది. రాజకీయాలలో ఇలా మొండితనంతో వ్యవహరించేవారు ఎక్కువ కాలం రాణించలేరు. ఆత్మవిమర్శ చేసుకుంటూ, తప్పులు సవరించుకుంటూ అందరినీ కలుపుకుపోగలిగేవారే రాజకీయాలలో రాణించగలరు.

ఇందుకు ఏపీ, తెలంగాణ సిఎంలు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి గొప్ప ఉదాహరణలుగా కనిపిస్తున్నారు కదా?
చివరిగా ఒక మాట: ఫామ్‌హౌస్, ప్యాలస్ గోడల వెనుక వారు శిక్ష అనుభవిస్తున్న మాట ఎంత వాస్తవమో, ప్రజలు వారిని తిరస్కరించారనేందుకు కూడా ఆ గోడలే సాక్ష్యం!

ADVERTISEMENT
Latest Stories