anumula-revanth-reddy

రాష్ట్ర విభజన తర్వాత ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల మద్య చిత్రవిచిత్రమైన బంధాలు, శతృత్వాలు నెలకొనడం ఆశ్చర్యంగానే అనిపిస్తుంది. అక్కడ తెలంగాణలో కేసీఆర్‌, ఇక్కడ ఏపీలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు చంద్రబాబు కేసీఆర్‌కు స్నేహహస్తం అందిస్తే ఆయన ఛీదరించుకున్నారు.

Also Read – కొత్త జోక్: జనంతో జగన్‌ మమేకం!

విభజన సమస్యలను పరిష్కరించుకోకుండా అవసరమైనప్పుడు తెలంగాణ సెంటిమెంట్ రగిలించడానికే వాడుకునేవారు. చంద్రబాబు నాయుడుని రాజకీయంగా దెబ్బ తీసేందుకు చేయకూడని ప్రయత్నాలన్నీ చేశారు. కేసీఆర్‌ ధోరణితో విసుగెత్తిపోయిన చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధిపై దృష్టి సారించి కేసీఆర్‌కు దూరంగా ఉన్నా ఆయన పగ పట్టిన పాములా చంద్రబాబు నాయుడుని గద్దె దించేవరకు నిద్రపోలేదు.

అందుకు చంద్రబాబు నాయుడు కూడా 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలలో కేసీఆర్‌కు ‘సైలంట్‌గా రిటర్న్ గిఫ్ట్’ ఇచ్చేస్తే, కేసీఆర్‌ ఆ గిఫ్ట్ గురించి బయటకు చెప్పుకోలేక తెగ ఇబ్బందిపడ్డారు. అది వేరే కధ!

Also Read – కోడి కత్తి కేసు కూడా ఇలా బెడిసి కొట్టిందే!

ఏపీలో జగన్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్‌ ఇంటికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకొని ఆయన ఇంట్లో భోజనం చేసి వచ్చారు. కానీ విభజన సమస్యల పరిష్కారానికి ఇద్దరూ ఆసక్తి చూపలేదు… అని అనేకంటే తనను సిఎం చేసినందుకు కృతజ్ఞతగా వాటి గురించి జగన్‌ అడగటం మానుకున్నారని చెప్పవచ్చు.

కేసీఆర్‌ తన రాష్ట్రానికి జగన్‌ వలన నష్టం కలగకుండా జాగ్రత్త పడ్డారు. కానీ కేసీఆర్‌ ఏపీకి నష్టం కలిగిస్తున్నా జగన్‌ పట్టించుకోలేదు! కేసీఆర్‌, జగన్‌ తమ దోస్తీని వ్యక్తిగత స్థాయిలో అవసరాలకు, తమ పార్టీల రాజకీయ ప్రయోజనాలను కాపాడుకునేందుకే ఉపయోగించుకున్నారు. కనుక రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మద్య ఇంత సఖ్యత ఉన్నప్పటికీ ప్రభుత్వాల మద్య దూరం అలాగే ఉండిపోయింది.

Also Read – నేస్తమా ఇద్దరి లోకం ఒకటేలే..!

ఇప్పుడు ఏపీలో చంద్రబాబు నాయుడు, అక్కడ తెలంగాణలో రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రులు అయ్యారు. ఇద్దరి మద్య సత్సంబంధాలు ఉన్నందున, ముందు రేవంత్‌ రెడ్డే చొరవ తీసుకొని విభజన సమస్యలు పరిష్కరించుకుందామని ప్రతిపాదించగా అందుకు చంద్రబాబు నాయుడు కూడా సానుకూలంగా స్పందించారు.

తాజాగా హైదరాబాద్‌లో బసవ తారకం క్యాన్సర్ ఆస్పత్రి వార్షికోత్సవంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డి, మీడియాతో మాట్లాడుతూ, “మన సమర్ధత తెలియాలంటే అవతలివైపు బలమైన ఆటగాడు ఉండాలి. ఏపీ సిఎం చంద్రబాబు నాయుడుతో అభివృద్ధి, సంక్షేమంలో పోటీ పడేందుకు నాకు అవకాశం కలిగింది.

కానీ ఆయనతో పోటీ పడాలంటే ఇప్పటిలా మేము రోజుకి 12 గంటలు పనిచేస్తే సరిపోదు. ఆయనలాగే రోజుకి 18 గంటలు పనిచేయాల్సి ఉంటుంది. అప్పుడే ఆయనతో పోటీ పడే అర్హత సాధిస్తాము. అభివృద్ధిలో పోటీ వలన రెండు తెలుగు రాష్ట్రాలకు మేలు కలుగుతుంది,” అని అన్నారు.

ఈ పదేళ్ళలో ఇటువంటి సయోధ్య, దూరదృష్టి లేకపోవడం వలననే ఏపీ తీవ్రంగా నష్టపోయింది. ఇప్పుడు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మద్య సత్సంబంధాలు మాత్రమే కాదు… విభజన సమస్యలు పరిష్కరించుకోవాలని, పరస్పరం సహకరించుకుంటూ రెండు రాష్ట్రాలను అభివృద్ధి చేసుకోవాలనే బలమైన కోరిక, అవసరం కూడా ఉండటం తెలుగు ప్రజల అదృష్టమే.